మక్తల్: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులు గల అంతర్రాష్ట దొంగల ముఠాను (Interstate Gang Arrest ) మక్తల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య (DSP Lingaiah) తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రామ్ లాల్‌తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.
ఈనెల 6న మక్తల్ పట్టణంలోని రహమానియ కాలనీలో, ఇంటి ముందు ఆపి ఉన్న హోండా షైన్బైక్ను దొంగలించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మక్తల్ సీఐ రామలాల్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించగా శుక్రవారం ఉదయం మక్తల్ సబ్ స్టేషన్ ఎదుట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో నిందితులు బైకులకు పెట్రోల్ కొట్టించుకున్న సందర్భంలో మక్తల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారని తెలిపారు. వారి దగ్గర ఉన్న రెండు వాహనాలతో పాటు మరొక మూడు వాహనాల సమాచారం బయటపడిందని తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన కుంచు కోరం ఎల్లప్ప , సన్న దుర్గప్ప అలియాస్ దుర్గేష్, వీర పాపర్ వాహనాల చోరీకి పాల్పడుతున్నారని వివరించారు. దొంగిలించిన వాహనాలను యాదగిరి జిల్లా బసవేశ్వర నగర్‌కు చెందిన శంషుద్దీన్ విక్రయించేవారని తెలిపారు. వీరి వద్ద నుంచి వివిధ జిల్లాల నుంచి 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, కృష్ణ ఎస్సై ఎండీ నవీన్ , క్రైమ్ స్టాప్ శంకరయ్య, ఏఎస్సై, కానిస్టేబుల్ అశోక్, శ్రీకాంత్, శశిధర్, భరత్, సంపత్‌ను అభినందించారు.