వనపర్తి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘తాను చిన్నప్పుడు విద్యాభ్యాసం చేసిన బడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా.. ఈ పాఠశాల నన్ను ఇంతటి వాడిని చేసింది. ఈ ప్రాంతానికే పెద్ద పేరు తెచ్చి పెట్టిన సరస్వతి నిలయం రూపురేఖలనే మార్చేస్తా’.. అంటూ గత మార్చి 2న సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను వనపర్తిలో చదివిన హైస్కూల్, జూనియర్ కళాశాల (బాలుర) నూతన భవనాలకు శంకుస్థాపన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలివి..
బాల్యంలో ఇక్కడే విద్యాభ్యాసం చేయడం.. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పట్టణానికి రావడంతో నాటి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆ సమయంలో రేవంత్ కుటుంబం నివాసం ఉన్న ఇంటికి సైతం వెళ్లి నాటి సన్నిహితులను కలిశారు. ఈ సందర్భంగా పనులకు శ్రీకారం చుట్టి అర్ధ సంవత్సరం దాటినా అతీగతి లేదు. ఏకంగా సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకే దిక్కూమొక్కు లేకుండా పోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రూ.47.50 కోట్ల ప్రతిపాదనతో..
సీఎం చదువుకున్న బడికి, జూనియర్ కళాశాల భవనాలను అన్ని హంగులతో కొత్తగా నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో రూ.47.50 కోట్లతో ఎస్టిమేషన్ సిద్ధం చేయగా.. పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత శిలాఫలకం తీసుకెళ్లి సంబంధిత కార్యాలయంలో భద్రపరిచారు. నేటి వరకు ఈ పనుల ఊసెత్తకపోగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఒక సీఎం స్థాయిలో తాను విద్యాభ్యాసం చేసిన బడి, జూనియర్ కళాశాల భవన నిర్మాణ శంకుస్థాపనలకే మోక్షం లేకుంటే ఇక ఇతర పనుల సంగతి ఎలా ఉంటుందన్న చర్చ జిల్లాలో నడుస్తుంది.
కానరాని టెండర్ల ప్రక్రియ
సీఎం వేసిన శిలాఫలకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఉలుకూ.. పలుకూ లేదు. శాఖపరమైన చర్యలు లేనందునా ఈ భవనాల పనులు డీలా పడ్డాయని పట్టణవాసులు గుసగుసలాడుతున్నారు. వెంటనే పనులు కార్యరూపం దాలుస్తాయని ఇక్కడి విద్యావేత్తలు భావించారు. తర్వాత ఏడు నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. నూతన భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ప్రారంభించిన వాటిలో కొన్ని పనులు టెండర్ల రూపంలో ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. పనుల్లో కదలిక లేకపోవడం శోచనీయం. పేరుకే శిలాఫలకం వేసినట్లుగా కనిపిస్తుందని, ప్రాధాన్యత ఉంటే ఇప్పటికే పనులు మొదలయ్యేవన్న చర్చ ఉన్నది. సీఎం స్థాయిలో అభివృద్ధి పనులు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. శంకుస్థాపన చేసిన పనుల్లో ఒకట్రెండు మినహా అనేకం కార్యరూపం దాల్చకపోగా కాగితాల రూపంలోనూ ముందుకు కదలడం లేదన్న సందేహాలు
స్పందించని డీఈ..
వనపర్తిలో సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన హైస్కూల్, అలాగే జూనియర్ కళాశాల భవనాలకు సంబంధించిన నిర్మాణాల సమాచారం తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ 4 గంటలకు డీఈ వెంకట్రెడ్డికి ఫోన్ చేసింది. మధ్యాహ్నం 3:45 గంటల నుంచి 4:05 గంటల మధ్య మూడు దఫాలు ఫోన్ చేసినా ఈడబ్ల్యూఐడీసీ డీఈ అందుబాటులోకి రాలేదు.