హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్‌ను వికారాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీలు, గంజాయి స్మగ్లింగ్‌లో ఆరితేరిన తానేదార్ కోసం కొంతకాలంగా పోలీసులు వెతుకుతున్నారు. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో శుక్రవారం రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం ఎస్పీ చందనాదీప్తి మీడియాతో మాట్లాడుతూ.. ఆయనపై 2004 నుంచి ఇప్పటివరకు 62 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. యూపీలోని ఆలీఘర్ జిల్లా ఆర్ని గ్రామానికి చెందిన తానేదార్ సింగ్ దొంగతనాలే వృత్తిగా మలుచుకున్నాడు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుశిక్ష అనుభవించినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు.
2014లో బోలోనాథ్ పాయక్రావు, జావీద్తో కలిసి ముఠాగా ఏర్పడి నాటు తుపాకులతో రైళ్లలో దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఇటీవల అక్టోబర్ 7న ఔరంగాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఓ జంటపై దాడిచేసి సెల్‌ఫోన్, నగదు, ఇతర వస్తువులు అపహరించారు. దీంతో పోలీసులు ఆయనపై నిఘాపెట్టారు. చివరకు తానేదార్సింగ్ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన సొత్తును తీసుకుంటున్న ఆయన స్నేహితులు పంకజ్(ఆలీగఢ్), నందు (వికారాబాద్), సందీప్(ఆగ్రా) పైనా కేసులు నమోదు చేసినట్టు రైల్వే ఎస్పీ వెల్లడించారు.