హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 21 వరకు జరుగనున్నాయి. ఉ దయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. 5 నిమిషాలకంటే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
పరీక్షల నేపథ్యంలో నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు 040 -24655027, 92402 05555 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకనం మొదటి విడత ఈనెల 21 నుంచి ప్రారంభంకానుండగా, 24 నుంచి రెండో విడుత మూల్యాంకనం ప్రారంభించనున్నట్టు ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసి జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
