– ప్రోటోకాల్‌కు పాతర.. పాలనలో పరాయి వ్యక్తుల జోక్యం
– ప్రజా ప్రతినిధులు నామమాత్రం.. బంధువులదే పెత్తనం
– రికార్డుల భద్రత ప్రశ్నార్థకం
హుజూర్నగర్, మార్చి 23 : హుజూర్నగర్ మున్సిపాలిటీలో అసలు పాలకవర్గం కంటే, వారి కుటుంబ సభ్యుల ‘నీడ’లే రాజ్యమేలుతున్నాయి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు నామమాత్రంగానే మిగిలిపోతుండగా, వారి తరపున తండ్రులు, భర్తలు, కొడుకులు మున్సిపల్ కార్యాలయంలో తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు. ఈ ‘అనధికార’ పెత్తనం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో కీలక నిర్ణయాల నుండి అంతర్గత వ్యవహారాల వరకు అంతా ఈ ‘షాడో’ నేతలే నడిపిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్మయానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే ఈ అనధికార వ్యక్తులు వ్యాపార అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడంపై పట్టణ వాసులు మండి పడుతున్నారు. బడా వ్యాపారవేత్తలు పాలనలో వేలు పెట్టడం వల్ల మున్సిపల్ టెండర్లు, రహస్య సమాచారం బయటకు పొక్కి తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులు చూసేందుకు, అంతర్గత సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రజా ప్రతినిధులు మినహా ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. కానీ హుజూర్నగర్ మున్సిపాలిటీలో మాత్రం ఈ ప్రోటోకాల్ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు. గోప్యమైన సమాచారం, నిధుల కేటాయింపులు, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు బయటి వ్యక్తులకు చేరడం వల్ల భవిష్యత్‌లో పాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. కళ్లముందే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నా అనధికార వ్యక్తులు రికార్డులను ప్రభావితం చేస్తున్నా కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఈ ‘షాడో’ల పెత్తనానికి చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.