నీలగిరి, అక్టోబర్ 07 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం కలకలం సృష్టించింది. ఎప్పటిలాగే కళాశాలకు వచ్చిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ మండలం అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. బాలిక ఇంటర్ విద్యనభ్యసించేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కళాశాలలో చేరింది. దీంతో ఇరువురి మధ్య పరిచయం మరింత పెరిగింది.
దసరా సెలవుల అనంతరం విద్యార్థిని సోమవారం కళాశాలకు వచ్చింది. సోమవారం సైతం కృష్ణ బాలికను కలిసి మాట్లాడినట్లుగా సమాచారం. బాలిక నేడు ఉదయం 8 గంటలకు యాథావిదిగా ఇంటి నుండి బయల్దేరి నల్లగొండకు చేరుకుంది. సుమారు 8.30 గంటల ప్రాంతంలో బాలికను కలిసిన కృష్ణ పట్టణంలోని డైట్ కళాశాల పక్కనే ఉన్న తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయిపై బలాత్కారానికి పాల్పడ్డట్లు సమాచారం. దీంతో బాలిక షాక్కు గురైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఫిట్స్ వచ్చి చనిపోయింది. భయాందోళనకు గురైన కృష్ణ సంఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ శివరాం రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Nilagiri : నల్లగొండ పట్టణంలో కలకలం.. ఇంటర్ విద్యార్థినిపై హత్యాచారం?