హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నకిలీ ఫైర్ ఎన్వోసీల బారి నుంచి బయటపడేందుకు ఇంటర్ విద్య, హైడ్రా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లనున్నారు. ఫైర్ ఎన్వోసీల పరిశీలనకు ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా ఫైర్ ఎన్వోసీలను సులభంగా పరిశీలించి, ధ్రువీకరించే అవకాశం కల్పించనున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. విద్యార్థుల భద్రత, ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలు, ఫైర్ ఎన్వోసీల జారీ, ధ్రువీకరణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(టీపీజేఎంఏ) ప్రతినిధులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఫైర్ ఎన్వోసీ సమస్యలు, అగ్నిమాపక భద్రత చర్యల కఠిన అమలు, విద్యా సంస్థల్లో భద్రతకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.