సిటీబ్యూరో, ఆగస్ట్ 25 (నమస్తే తెలంగాణ) : హైడ్రా ఏర్పడి రెండేళ్లు దాటింది. ప్రారంభమైన తొలినాళ్లలో చేసిన విధ్వంసం ఆనవాళ్లే కాకుండా వాటి ప్రభావం ఇప్పటికీ బాధితులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం హైడ్రా.. తాము సున్నం చెరువు వద్ద ఆక్రమణలు తొలగిస్తున్నామంటూ చెప్పి తెల్లవారుజామునే వచ్చి బుల్డోజర్లతో ఇళ్లకు ఇళ్లే కూల్చేసిన దృశ్యాలు ఇప్పటికీ అందరి కళ్లముందు కదలాడుతున్నాయి. మాదాపూర్లోని గుట్టలబేగంపేటలో సున్నంచెరువు వద్ద సర్వేనంబర్లు 12,13లో కట్టుకున్న ఇళ్లను, షెడ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడమే కాకుండా అదే ప్రాంతంలోని పేదవారి నివాసాలను కూడా బుల్డోజర్లతో నేల మట్టం చేసింది హైడ్రా. కట్టుబట్టలతో బయటకు వచ్చిన వారి కన్నీళ్లు చెరువైనా పట్టించుకునే నాథుడే లేరు.
అధికార కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరి, హైడ్రా తొందరపాటుతో చాలామంది నిలువనీడలేకుండా రోడ్డుపాలయ్యారు. ఆ తర్వాత తాము మొదటి 3 నెలలు కొంత దూకుడుగా వ్యవహరించిన మాట నిజమేనని, ఇది యుద్ధమని, కొన్ని పనులు జరగాలంటే కొందరు నష్టపోవలసిందేనంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ తప్పును సమర్థించుకుంటూ పలు ప్రాయోజిత ఇంటర్వ్యూలకు చెప్పిన మాటలు అందరి చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయి. తమ ఇల్లు కూల్చేసిన సందర్భంలో జరిగిన తొందరపాటుకు కారణం హైడ్రానే అని రంగనాథ్ చెప్పినా బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు సరికదా.. ఇప్పటికీ ఆ విధ్వంసపు ఆనవాళ్లు గుట్టలబేగంపేటలో కనిపిస్తున్నాయి. అంతేకాదు కూల్చిన ఇంటికి బిల్లులు కట్టడం మాత్రం ఆగడం లేదు. ఒకవైపు కరెంటు బిల్లులు, మరోవైపు ఆస్తి పన్నులు కడుతూ తమ జేబులు ఖాళీ చేసుకోవలసిందే తప్ప.. లేని ఇళ్లకు తాము ఈ బిల్లులు కట్టడం ఏంటో అర్ధం కావడం లేదని సున్నం చెరువు బాధితులు అంటున్నారు.
క్యూర్ పరిధిలోని మాధాపూర్ వద్ద గుట్టలబేగంపేటలోని ఇంటినెంబర్ 1-66/9/30/188 కలిగిన 1980 చ.గ.లలోని ఇంటికి ఇటీవల రూ.26,330 ఆస్తిపన్ను వేశారు. ఈ ఇంటిని 2024 సెప్టెంబర్లో సున్నం చెరువు బఫర్, ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ హైడ్రా కూల్చివేతలలో నేలమట్టం చేశారు. అక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదు సరికదా ప్రస్తుతం ఆ ప్రాంతంలో హైడ్రా సున్నంచెరువుకు సంబంధించిన కొన్ని పనులు కూడా చేపట్టినట్లు సమాచారం. కొందరికి వాటర్ బిల్లులు కూడా వస్తున్నాయని అవికూడా చెల్లిస్తున్నామని వారు చెప్పారు. ఇదే కాకుండా ఆ సమయంలో కూల్చివేసిన ఇళ్లకు ఇప్పటికీ కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి వినియోగాన్ని బట్టి వస్తున్నప్పటికీ వాటిని రెగ్యులర్గా హైడ్రా కూల్చివేతల బాధితులు చెల్లిస్తూ వస్తున్నారు. కానీ తమ ఇళ్లు, ప్లాట్లు తమకు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లంపేటలోని ఒక ఇంటిని కూడా హైడ్రా కూల్చివేసినప్పటికీ ఆ ఇంటికి సంబంధించిన బ్యాంకు లోన్, ఇతర బిల్లులు కూడా ఇప్పటికీ చెల్లిస్తున్నట్లు ఆ ఇంటి యజమాని చెప్పారు.
తమ ఇళ్లు కూల్చివేసిన చోట తమకు బిల్లులు వస్తున్నాయంటూ ఆయా ఇంటి యజమానులు ఇప్పటికీ కార్పొరేషన్, కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తాము నివాసం ఉండకపోయినా తమకు కరెంట్ బిల్లు వస్తున్నదని, మినిమమ్ బిల్లు రావడంతో తాము కడ్తున్నామని చెప్పారు. అక్కడ మీటర్లు లేవని, వాటిని హైడ్రా కూల్చివేతల సమయంలోనే కరెంట్ వాళ్లు తీసుకుపోయారని వారు పేర్కొన్నారు. అప్పుడే అక్కడ కరెంట్ స్తంభాలు కూడా పూర్తిగా పగులగొట్టారని, రెండు లైన్లు ఉండేవాటిని కూడా తీసేశారని చెప్పారు. అక్కడ ఉన్న బిల్డింగు కూల్చేసిన వారి పక్కనే ఉన్న షెడ్డుల వాళ్లుకూడా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. ఇలా కరెంట్ బిల్లులు, ఆస్తి పన్నులు ఎందుకు వస్తున్నాయని అడిగినా.. అధికారులు ఎవరూ సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైకోర్టులో ఈ బిల్లులు కూడా సమర్పించామని, తమ పేర్లతో ఇళ్లు ఉన్నాయని, ప్లాట్లు కూడా తమవేనంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి రెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నామని హైడ్రా బాధితులు చెప్పారు.
హైడ్రా.. మా ఇల్లును కూలగొట్టి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విద్యుత్ అధికారులు నెలనెలా కరెంట్ బ్లిలు పంపిస్తున్నారు. ఈనెల కూడా కరెంట్ బిల్లు కట్టాను. మనిషికి ఉరి తీసేముందు కూడా సమయం ఇస్తారు.. కానీ ఆ టైమ్ కూడా ఇవ్వకుండా మా ఇంటిని హైడ్రా వాళ్లు కూల్చేశారు. మా ఇల్లు కూల్చేసిన నాటి నుంచి ఈరోజు వరకు నరకయాతన అనుభవిస్తున్నాం. రేవంత్రెడ్డి, హైడ్రా అధికారులకు మా ఉసురు తప్పకుండా తగుల్తది. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు.