HomeNewsInspired By Gen Z Generation Alpha Born Between 2010 And 2024 Has Sounded The Battle Cry Regarding The Issues That Affect Them
జెన్ ఆల్ఫా.. సమరశంఖం!
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో యువత చేసిన ఆందోళనలు, జార్ఖండ్‌లో జెన్ జీలు చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు జెన్ జీల స్ఫూర్తితో 2010-2024 మధ్య పుట్టిన జెన్ అల్ఫా తరం తమ సమస్యలపై సమరశంఖం పూరించింది.
జెన్ జీ స్ఫూర్తితో నిరసనల పర్వం
స్కూళ్లలో సౌకర్యాలలేమిపై గళం
ఎమ్మెల్యేలనూ నిలదీస్తూ ముందుకు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉద్ధృతం
హైదరాబాద్, ఆగస్టు 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో యువత చేసిన ఆందోళనలు, జార్ఖండ్‌లో జెన్ జీలు చేసిన నిరసనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు జెన్ జీల స్ఫూర్తితో 2010-2024 మధ్య పుట్టిన జెన్ అల్ఫా తరం తమ సమస్యలపై సమరశంఖం పూరించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ నిరసనలు ఉద్ధృతమవుతుండటం గమనార్హం.
స్కూళ్లలో సమస్యలపై..
పాఠశాలల్లో బెంచీలు, మరుగుదొడ్లు, తరగతి గదులు అందుబాటులో లేకపోవడం, విద్యార్థులకు సరిపడా టీచర్లు లేకపోవడం, నాణ్యమైన విద్య, సౌకర్యాల కోసం జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ గళం విప్పి యంత్రాంగాన్ని నిలదీస్తున్నారు. యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఈ నిరసనలు మరింతగా ఉద్ధృతమవుతున్నాయి. ఇక, కేంద్రీయ విద్యాలయాల్లో స్థానిక పాఠశాలలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్‌లోని 11 జిల్లాల్లోని జెన్ ఆల్ఫా విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూళ్లలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. మరోవైపు, బీహార్‌లోని గయా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులైతే సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెను విధ్వంసం సృష్టించారు. పాఠశాలలోని ఫ్యాన్లు, హ్యాండ్ పంపులు, బెంచీలు ధ్వంసం చేసిన అనంతరం భారీ ధర్నాకు దిగారు.
పరిష్కారానికి పట్టు
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జెన్ అల్ఫా విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర చౌదరి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పాఠశాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయమయ్యిందని, దీంతో తమ యూనిఫామ్‌పై మరకలు పడుతున్నాయని ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆయన కాన్వాయ్‌ను వెళ్లనిచ్చారు. ఇక, తమకు సరిపడా ఉపాధ్యాయులు లేరంటూ రాజస్థాన్‌లోని జాలూరు జిల్లా మెంగల్వా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల బయట గంటల కొద్దీ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగివచ్చిన అధికారులు నలుగురు ఉపాధ్యాయులను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయడమే కాక, మిగిలిన ఖాళీలను 10 రోజుల్లో భర్తీ చేస్తామని హామీనిచ్చారు.