కాచిగూడ, మార్చి 31: దేశంలో 74 ఏండ్లుగా బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో న్యాయం జరుగడంలేదని, అన్ని రంగాల్లో అన్యాయమే ఎదురవుతున్నదని మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం దేవెగౌడకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు అన్ని పార్టీలతో సంప్రదిస్తానని దేవెగౌడ హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు. కేంద్రం జనాభా గణనలో కులగణన చేయాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓబీసీ గణన చేయాల్సిందే
భావితరాల బంగారు భవిష్యత్ కోసం కులగణన చేపట్టాల్సిందేనని, అందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కృష్ణయ్య మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ న్యాయవాదుల జేఏసీ నాయకుడు జక్కుల వంశీ పాల్గొన్నారు.