హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): వెలుగుల రేణి సింగరేణికి ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఈఐ) ఇండియా అందజేసే ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ పురస్కారం దక్కింది. ఐఈఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా సింగరేణి తరపున కే నాగభూషణ్‌రెడ్డి అవార్డును స్వీకరించారు.
అత్యుత్తమ వ్యాపార విలువలకు గాను సింగరేణి సంస్థ ఈ అవార్డుకు ఎంపికైంది. దీనిపై సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సహా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో సింగరేణికి ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, ఔట్‌స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, ఆసియా మోస్ట్ ట్రస్ట్డ్ కంపెనీ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ అవార్డు, పర్యావరణహిత చర్యలకు గాను గోల్డెన్ పికాక్ వారి ఇన్నోవేటివ్ సహా పలు సీఎస్ఆర్ అవార్డులు దక్కాయి.