Indonesia : ఇండోనేషియా తీరంలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గల్లంతైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్య బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ నుంచి బోర్నియా దీవుల్లోని దక్షిణి కాలిమంటాన్ వెళ్తుండగా శనివారం ఈ ఘటన జరిగింది. సురబాయ నుంచి బంజర్మాసిన్ ప్రాంతాల మధ్య ఈ పడవ ప్రయాణిస్తుంది. జావా తీరం నుంచి 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న వర్గో ట్రాన్స్పోర్ట్ 8 సంస్థకు చెందిన ఈ పడవతో కమ్యూనికేషన్ తెగిపోయింది.
దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. షిప్పు ఆపరేటర్ అందించిన సమాచారం మేరకు గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జావా తీరం నుంచి 148 కిలోమీటర్ల దూరంలో పడవంతో సంబంధాలు తెగిపోయాయి. వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్లే పడవతో సంబంధాలు తెగిపోయినట్లు అనుమానిస్తున్నారు. పడవ మునిగిపోయిందా.. లేక సురక్షితంగానే ఉందా అనే సమచారం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం నౌక ఎక్కడ ఉందో గాలిస్తున్నామని, నౌక ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రెస్క్యూ బృందాలు తెలిపాయి.
నౌకలోని ప్రయాణికుల గురించి కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారా.. లేదా గల్లంతయ్యారా అనే విషయాలు కూడా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఇండోనేషియా తీరంలో నౌకా ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న పలు నౌకలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నౌకలు అగ్నిప్రమాదాలకు కూడా గురవుతున్నాయి. అయితే, రెస్క్యూ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికుల్ని కాపాడుతున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.