బంజారాహిల్స్,డిసెంబర్ 18: జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. రాత్రీ పగలు అనే తేడా లేకుండా వీడీసీసీ, సీసీ రోడ్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ఈ రోడ్ల స్థానంలో ఎక్కువ కాలం పాడవని వీడీసీసీ రోడ్లను వేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 10(సి)లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఇప్పటికే సుమారు 3 రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన అధికారులు తాజాగా మరో రోడ్డును వీడీసీసీగా మారుస్తున్నారు. రూ.11లక్షల వ్యయంతో రెండు వీధుల్లో వీడీసీసీ రోడ్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెనకాల రోడ్ నం 41లో కూడా వీడీసీసీ రోడ్డును వేస్తున్నారు. పగటి పూట ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి పూట పనులను నిర్వహిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ రెండు రోడ్ల పనులు పూర్తవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత బంజారాహిల్స్ రోడ్ నం 2లోని ఇందిరానగర్‌లోని మహిళా మండలి భవనం సమీపంలో పాడయిన రోడ్డు స్థానంలో రూ.8 లక్షల వ్యయంతో వీడీసీసీ రోడ్డు పనులను ప్రారంభించనున్నామని జీహెచ్ఎంసీ సర్కిల్ 18 ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు.
ఎమ్మెల్యే కాలనీలో రూ.11లక్షలతో పనులు
జూబ్లీహిల్స్ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులను, ఇటీవల మంజూరైన నిధులతో చేపట్టాం. ఇప్పటికే నందగిరి హిల్స్‌లో రూ.41లక్షలో రోడ్డు పనులు పూర్తి చేశాం. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో కొత్త రోడ్లను వేయిస్తున్నాం. మిగిలిన ప్రాంతాల్లో మంజూరైన రోడ్డు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే కాలనీలో రూ. 11లక్షలతో పనులు చేస్తున్నాం.