కవాడిగూడ, మార్చి 26 : ఇందిరాపార్కులో విలువైన స్థలం కబ్జాకు గురవుతుందని వాకర్స్, పర్యావరణ పరిరక్షణ కమిటీతో పాటు స్థానికుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. పార్కులోని పాత స్కేటింగ్ స్టేడియం ఖాళీగా ఉండటంతో ఓ వ్యక్తి కరాటే కోచింగ్ శిక్షణ ఇస్తూ కబ్జాలోకి తీసుకున్నాడు. సదరు వ్యక్తి గేటుకు తాళం వేసి ఆ స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇటీవల కాలంలో షెడ్ నిర్మాణ పనులను చేపట్టేందుకు పనులు ప్రారంభించి నిర్మాణ సామాగ్రిని అందులో డంప్ చేశారు. పార్కు ప్రహరీ కూల్చివేయడంతో వాకర్స్, పర్యావరణ పరిరక్షణ కమిటీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సంతకాల సేకరణ చేపట్టారు.
కబ్జాపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో పాటు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారుని కలసి పార్కులోని ఖాళీ స్థలంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకొని కబ్జాకు గురికాకుండా ఆ స్థలాలన్నీ జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. స్పందించిన జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ సర్కిల్ డీఎంసీ పుష్పలత, జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా ఏసీపీ తిరుమల్, ఎస్ఐ నర్సింగ్‌రావు ఖాళీ స్థలాన్ని ఇటీవల పరిశీలించారు. అనుమతి లేకుండా పార్కుగోడను కూల్చిన కాంట్రాక్టర్‌తో నూతన గోడ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, సివిల్ కాంట్రాక్టర్ రవీందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ మంగతాయారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ ఏడీ శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.