Indigestion Home Remedies | పండుగలు లేదా ఇతర శుభ కార్యాల సమయంలో, బయట రెస్టారెంట్లలో తిన్నప్పుడు కాస్త ఆహారాన్ని ఎక్కువగానే తింటుంటారు. దీంతో పొట్ట చాలా హెవీ అవుతుంది. ఇది సహజమే అయితే ఇలా తిన్నప్పుడు తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది. బాగా హెవీగా మీల్స్ చేసినప్పుడు ఆయాసం కూడా వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పలు చిట్కాలను పాటించడం వల్ల మీ జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. దీంతో తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది.
బాగా అతిగా ఆహారం తీసుకున్న తరువాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నెమ్మదిగా కాసేపు వాకింగ్ చేయాలి. దీంతో పొట్టలో ఉండే అసౌకర్యం పోతుంది. గ్యాస్, అసిడిటీ రావు. అజీర్తి ఉండదు. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు ఈ వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడంటే అప్పుడు చేయవచ్చు. కానీ మరీ వేగంగా నడవకూడదు. ఒక మోస్తరు నడక చాలు. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
బాగా అతిగా భోజనం చేసిన అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే హెర్బల్ టీ లను కూడా తాగవచ్చు. ముఖ్యంగా అల్లం, పెప్పర్మింట్, కమోమిల్ వంటి హెర్బల్ టీలను సేవిస్తుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. దీంతో గ్యాస్ కూడా ఉండదు. ఇక చాలా మంది అతిగా ఆహారం తినప్పుడు శీతల పానీయాలను సేవిస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. చల్లని పానీయాల వల్ల జీర్ణక్రియ మరింత ఆలస్యం అవుతుంది. దీంతో గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక అతిగా ఆహారం తింటే వేడి పానీయాలనే తాగాల్సి ఉంటుంది.
ఎక్కువ ఆహారం తిన్నప్పుడు సహజంగానే మనం టెన్షన్‌కు గురవుతాం. దీని వల్ల కూడా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీంతో గ్యాస్ వస్తుంది. అలాంటప్పుడు మైండ్‌ను రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. ఒత్తిడి లేకుండా ధ్యానం చేయాలి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడదు. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన అనంతరం కొన్ని సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. సోంపు గింజలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. అజీర్తి నుంచి బయట పడేలా చేస్తాయి. గ్యాస్‌ను తగ్గిస్తాయి. దీంతో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అతిగా ఆహారం తిన్న తరువాత కొందరు ఆయాసం తట్టుకోలేక బెడ్‌పై వెల్లకిలా పడుకుంటారు. ఇలా అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుంది. దీంతో సమస్యలు మరింత పెరుగుతాయి. కనుక బాగా ఆహారం తిన్నాక వీలున్నంత సేపు కూర్చుని ఉండాలి. లేదా వాకింగ్ చేయాలి. దీంతో జీర్ణ సమస్యలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. భోజనం చేసిన అనంతరం వేసే యోగాసనం ఒకటి ఉంది. అదే వజ్రాసనం. దీన్ని భోజనం చేశాక వేయవచ్చు. ఈ ఆసనాన్ని వేయడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.