అహ్మదాబాద్ : భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పింది. గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న చాను.. అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం గెలిచి సత్తాచాటింది. మహిళల 48 కిలోల విభాగంలో ఆమె.. 193 కిలోలు (స్నాచ్ 84కి.+ క్లీన్ అండ్ జెర్క్ 109 కి.) ఎత్తి పసిడిని ముద్దాడింది. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలోనే 84 కిలోలు ఎత్తిన ఈ టోక్యో ఒలింపిక్ రజత విజేత..
ఆ తర్వాత కుడి మోకాలు ఇబ్బందిపెట్టడంతో తర్వాత ప్రయత్నాల్లో సఫలం కాలేకపోయింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొదటి ప్రయత్నంలో 105 కిలోలను ఎత్తిన ఆమె.. దానిని 109 కి. వరకు పెంచగలిగింది. కామన్వెల్త్ చాంపియన్‌షిప్స్‌లో ఇదో (193 కి.) రికార్డు. మలేషియాకు చెందిన హెన్రీ (161 కి.) రజతం గెలుచుకోగా వేల్స్ అమ్మాయి నికోల్ రాబర్ట్స్ (150 కి.) కాంస్యం నెగ్గింది. ఇవే పోటీల జూనియ ర్ కేటగిరలో భారత్‌కు చెందిన సౌమ్య దల్వి స్వర్ణం గెలిచింది.