Dusharla Satyanarayana | సూర్యాపేటకు చెందిన 69 ఏండ్ల పర్యావరణ వేత్త దుసర్ల సత్యనారాయణపై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం `ఇండియాస్ గ్రేట్ హార్ట్ దుసర్ల సత్యనారాయణ` ఈ నెల 22-24 తేదీల మధ్య ఢిల్లీలో జరిగే నాలుగో నది ఉత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నదర్శక నిర్మాత చిలుకూరి సుశీల్‌రావు నిర్మించిన `ఇండియాస్ గ్రేట్ హార్ట్ దుసర్ల సత్యనారాయణ` డాక్యుమెంటరీ సినిమా.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ జాతీయ కళల కేంద్రంలో నిర్వహించే నాలుగో నదీ ఉత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. మూడు రోజుల పాటు జరిగే నదీ ఉత్సవంలో ప్రదర్శించే 15 డాక్యుమెంటరీ చిత్రాల్లో ఇదీ ఒకటి.
ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణ వేత్తగా దుసర్ల సత్యనారాయణ విజన్‌ని తెలుపుతుంది `ఇండియాస్ గ్రేట్ హార్ట్ దుసర్ల సత్యనారాయణ`. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపాన రాఘవపురంలో తన పూర్వీకుల 70 ఎకరాల భూమిలో అద్భుతమైన అడవిని సృష్టించారు. ఆరు దశాబ్ధాలకు పైగా అభివృద్ధి చేసిన ఈ అడవిని ఇప్పటికి సురక్షితంగా కాపాడుతున్నారు. బాల్యంలోనే ప్రకృతి అంటే ప్రాణ ప్రదంగా దుసర్ల సత్యనారాయణ.. సంకల్పం, చిత్తశుద్ధి, ఆసక్తి ఉంటే ఎవరైనా అడవిని పెంచగలరని రుజువు చేశారు.
ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న నల్లగొండ జిల్లా వాసులకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలని పదే పదే అధికారుల దృష్టికి తేవడంతో దేశ ప్రజలందరికీ సుపరిచితుడు దుసర్ల సత్యనారాయణ. సొంతంగా అభివృద్ధి చేసిన అడవిలో ఒక చెరువు కూడా నిర్వహిస్తున్నారు. ఆ చెరువులో కలువ పూలు వికసించే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ అడవి వైభవాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు, పర్యావరణ వేత్తలు, పక్షుల ప్రేమికులు, హరిత యోధులు ఆ అడవిని సందర్శించే విషయాలను ఈ డాక్యుమెంటరీ చిత్రం వెల్లడిస్తుంది.
నది ఉత్సవ్‌లో భాగంగా `నదికి ధన్యవాదాలు: మానవులు, నదీ జీవితం మధ్య సామరస్యం పూర్వ వైభవం` అనే అంశంపై జాతీయ సెమినార్ కూడా నిర్వహిస్తున్నారు. స్కాలర్లు, అకడమిషయన్లు, రీసెర్చర్లకు ఈ సెమినార్ వేదిక కల్పిస్తుంది. ఈ సదస్సులో నదులు, జల సంస్థలకు అన్ని వర్గాల ప్రజల జీవితానికి గల అనుబంధంపై చర్చిస్తారు. నదుల సంస్కృతిపై ప్రత్యేక ప్రస్తావనతో సుస్థిర అభివృద్ధి భావనను పునర్నిర్వచించడం ఈ సెమినార్ లక్ష్యం.