వనస్థలిపురం, జూలై 11 : ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన తెలుగు విద్యార్థి మృత్యువాతపడ్డారు. వనస్థలిపురం వైదేహీనగర్లో నివాసముండే గుజ్జ ముత్యంరెడ్డి, మమత దంపతుల కుమారుడు గుజ్జ మణిదీప్రెడ్డి 9నెలల క్రితం ఇంజినీరింగ్ చదివేందుకు ఫిన్లాండ్ దేశం వెళ్లాడు. మే 5 నుంచి మనుదీప్తో కమ్యూనికేషన్ లేకుండాపోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడు చదువుతున్న కళాశాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుడాపోయింది.
అనంతరం జూన్ 10వ తేదీన సీఎం రేవంత్రెడ్డి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో.. వారు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఫిన్లాండ్లోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ మనుదీప్ కోసం దర్యాప్తు ప్రారంభించింది. ఈనెల 9వ క్రూనువోరెంటా సముద్ర తీరంలో ఒక మృతదేహం లభించింది. దానిని పరిశీలించిన అక్కడి అధికారులు మనుదీప్ మృతదేహంగా గుర్తించారు. కాగా, తల్లిదండ్రులు మాత్రం ఆ మృతదేహం తమ కుమారుడిది కాదని చెబుతున్నారు.
తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మే 5న అదృశ్యమైన మణిదీప్.. 65 రోజుల తర్వాత సముద్రంలో ఎలా దొరుకుతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును మూడు వారాల్లో పూర్తి చేయాలని ఫిన్లాండ్ దేశంలో ఆదేశాలు ఉన్నాయని, అందుకే కేసును మూసివేసేందుకు ఎవరో మృతదేహాన్ని తమ కుమారుడిదిగా చెప్పి నమ్మించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ దేశానికే చెందిన ఓ వ్యక్తిపై తమకు అనుమానం ఉన్నదని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కుమారుడి ఆచూకీ దొరికేవరకు ప్రయత్నాలు ఆపబోమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని మణిదీప్రెడ్డి తండ్రి ముత్యంరెడ్డి కోరారు.