న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక డెఫిలింపిక్స్ టోర్నీలో భారత యువ షూటర్ మహిత్ సంధు పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే మూడు పతకాలు దక్కించుకున్న మహిత్ తాజాగా మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో మహిత్ 456 స్కోరుతో టోర్నీలో రెండో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
ఇదే విభాగంలో డియాన్ జియాంగ్(453.5, దక్షిణకొరియా), మైరా జుసానా(438.6, హంగరీ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఫైనల్కు చేరుకునే క్రమంలో మహిత్ 585 స్కోరుతో గతంలో తన పేరిటే ఉన్న రికార్డు(576)ను తిరుగరాసింది.