న్యూఢిల్లీ, నవంబర్ 22: బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఇక లైన్‌క్లియర్ అయింది. గతంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన నరేంద్ర మోదీ సర్కార్ ఇక నుంచి 100 శాతం ఎఫ్‌డీఐలకు పచ్చజెండా ఊపింది. డిసెంబర్ 1 నుంచి అదే నెల 19 వరకు 15 రోజుల పాటు సాగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టబోతున్నది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, బీమా చట్టం(సవరణ) బిల్లు 2025 ప్రవేశపెట్టబోతున్నట్టు లోక్‌సభ బులిటెన్‌లో వెల్లడించింది.
బీమా రంగ పరిమితిని పెంపొందించడంతోపాటు వృద్ధి, అభివృద్ధిని వేగవంతం చేయడం, బీమా రంగ సంస్థల వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రసంగంలో బీమా రంగంలోకి వచ్చే ఎఫ్‌డీఐల పరిమితిని 74% నుంచి 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్శించడంలో దేశీయ బీమా రంగం దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు ఈ రంగంలోకి రూ.82 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఎఫ్‌డీఐల పరిమితిని పెంచడం, సరళీకృత వ్యాపార విధానాలు, బీమా చట్టం-1938లో భారీ మార్పులు చేయడం కలిసొచ్చింది. బీమా చట్టం 1938ని పలుమార్లు సవరించింది. జీవిత బీమా కార్పొరేషన్ చట్టం 1956, బీమా నియంత్రణ-అభివృద్ధి ఆథార్టీ చట్టం 1999 ప్రకారం సవరించింది. ఇదే క్రమంలో దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా అనుమతిచ్చింది. ప్రతిపాదిత సవరణ ప్రధానంగా పాలసీదారుల ప్రయోజనాలను ప్రోత్సహించడం, వారి ఆర్థిక భద్రతను పెంపొందించడం, బీమా మార్కెట్లోకి అదనపు భాగస్వాముల ప్రవేశాన్ని సులభతరం చేయడం, తద్వారా ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. ఇతర రంగాల మాదిరిగానే బీమా రంగం పలు సవాళ్లను
ఎదుర్కొన్నది.