దుబాయ్: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్లబ్ త్రోయర్ ధరమ్‌బీర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల ఎఫ్32/51 క్లబ్‌త్రో ఈవెంట్లో డిస్క్ ధరమ్‌బీర్ 31.09 మీటర్ల దూరం విసిరి రజత పతకంతో మెరిశాడు. ఈ క్రమంలో ధరమ్‌బీర్ ఆసియా రికార్డును తిరుగరాశాడు. వాలిద్ ఫెర్హహ్ (37.42మీ) టాప్‌లో నిలిచి పసిడి కైవసం చేసుకోగా.. బ్రిటన్ అథ్లెట్ స్టిఫెన్ మిల్లర్ (29.28మీ) కాంస్యం చేజిక్కించు కున్నాడు. పురుషుల ఎఫ్44 డిస్కస్‌త్రోలో దేవేంద్రసింగ్ 50.36మీటర్ల దూరంతో రజతం కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల 400మీటర్ల టీ37/43/44 విభాగంలో జ్యోతి బెహరా కాంస్యం ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 43 దేశాల నుంచి దాదాపు 500 మందికి పైగా ప్లేయర్లు పోటీపడుతున్నారు.