సింగపూర్: ఆసియాకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత యువ ఆర్చర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం ఐదు వేర్వేరు టీమ్ విభాగాల్లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కనీసం రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. రెండో సీడ్ భారత పురుషుల రికర్వ్ టీమ్ ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో 5-1తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. విష్ణుచౌదరి, పారాస్ హుడా, జుయల్ సర్కార్‌తో కూడిన భారత త్రయం..బంగ్లాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో వైష్ణవి పవార్, విష్ణు చౌదరి ద్వయం 5-3తో సింగపూర్‌కు చెందిన తబిత లిన్యో, యు లాంగ్ జోడీపై గెలిచింది. హోరాహోరీగా సాగిన పురుషుల కాంపౌండ్ టీమ్ సెమీస్‌లో భారత త్రయం కుశాల్ దలాల్, గణేశ్ తిరుమూరు, మిహిర్ అపార్ 30-29(షూటౌట్)లో ఆస్ట్రేలియాపై గెలిచి తుదిపోరులో నిలిచారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ సెమీస్‌లో షణ్ముకి , తేజాల్, తనిష్క 230-229తో కజకిస్థాన్‌ను ఓడించింది.