అమ్మ కావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ వరం అందుకునేవేళ ఆనందంగా, ఆరోగ్యంగా, సౌకర్యంగా బతకాలని అందరూ కోరుకుంటారు. చట్టం కూడా దాన్నే ఆదేశిస్తుంది. పనిచేసే మహిళలకు మాతృత్వపు ఆనందం, ఆరోగ్యం దూరం కాకుండా ఉండేందుకు ప్రసూతి ప్రయోజన చట్టం చేసింది. తల్లి కాబోయే మహిళకు ప్రభుత్వ విభాగాలు, కంపెనీలు సెలవులు, వేతనం, ఇతర సదుపాయాలు కల్పించేలా రక్షణలు ఏర్పాటుచేసింది. ఉద్యోగం పోతుందనే భయం లేకుండా, పుట్టే బిడ్డతో సంతోషంగా గడపమని చెబుతున్నది. ప్రసూతి సదుపాయాల చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రముఖ న్యాయ సహాయకురాలు జి. జ్యోతి రావు తెలియజేసిన వివరాలు ‘జిందగీ’ పాఠకుల కోసం..
ప్రసూతి సెలవులు ఎప్పుడు తీసుకోవచ్చు?
గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత సెలవులు తీసుకోవచ్చు. గర్భ విచ్ఛిత్తి అయినా, కాబోయే తల్లి ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులున్నా డాక్టర్ల సలహా మేరకు గర్భం తీయాల్సి వస్తే.. ప్రసూతి ప్రయోజన చట్టం ప్రకారం సెలవులు పొందవచ్చు.
ప్రసూతి సెలవులు ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగులకు వర్తిస్తాయా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు/ కార్మికులు పనిచేసే ప్రైవేటు సంస్థలు, కర్మాగారాలు, గనులు, దుకాణాలకు ప్రసూతి ప్రయోజన చట్టం వర్తిస్తుంది. ఈ సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు ప్రసూతి సెలవులు పొందడానికి అర్హులు.
పెళ్లికాని వాళ్లు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చా?
ప్రసూతి ప్రయోజన చట్టం ద్వారా సెలవులు, వేతనం, సదుపాయాలు పొందడానికి వివాహం, వైధవ్యంతో సంబంధం లేదు. గర్భధారణ అయినట్లుగా వైద్యులు ధ్రువీకరిస్తే చాలు.
ఈ సెలవులు గరిష్ఠంగా ఎన్ని రోజులు తీసుకోవచ్చు?
అందరి ఆరోగ్య స్థితి ఒకేలా ఉండదు. అలాగే అందరి ఇళ్లలో ఒకే విధమైన పరిస్థితులు ఉండవు. తల్లి, అత్త సహకారం ఉన్న మహిళలు బిడ్డల ఆలనాపాలనా ఇంట్లో పెద్దవాళ్లకు అప్పగించి ఆఫీస్‌కి వెళ్తుంటారు. కానీ, అందరికీ ఇలాంటి పరిస్థితులు ఉండవు. మరికొంతమంది ప్రసూతి సమయంలో ఆపరేషన్ జరగడం, అనారోగ్యం బారినపడటం వల్ల త్వరగా కోలుకోరు. కాబట్టి ప్రసూతి సెలువులు ముగిసినా విధులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. ఇలాంటి ఆరోగ్య, సామాజిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రసూతి సెలవులు పొడిగించుకునేలా చట్టం వెసులుబాటు కల్పించింది.
ప్రసూతి సెలవుల్లో వేతనం ఎంత ఇస్తారు?
ప్రసూతి సెలవులన్నీ వేతన సెలవులే. ప్రతి సంస్థ తమ ఉద్యోగినులకు మెడికల్ ఖర్చులు, బోనస్, పిల్లలకు పాలు ఇవ్వడానికి సదుపాయాలు కల్పించాలని ప్రసూతి ప్రయోజన చట్టం నిర్దేశిస్తున్నది. ప్రసూతి ప్రయోజనాల చట్టం స్త్రీలు ఉద్యోగాలు చేయడాన్ని ప్రోత్సహించడమే కాకుండా మాతా శిశు సంక్షేమానికి వసతులు కల్పిస్తుంది. జీతభత్యాలు, ఇంటి అద్దె, వైద్య ఖర్చులకు కోత పెట్టే హక్కు ప్రభుత్వానికి గానీ, ప్రైవేట్ సంస్థలకు గానీ లేదు. కానీ, కార్యాలయానికి హాజరయ్యేందుకు ఇచ్చే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లాంటి భత్యాల్లో కోత విధించవచ్చు.
తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ముందే ఆఫీసుకు పోవచ్చా?
ప్రసూతి సెలవులకు గరిష్ఠ పరిమితి ఉంది. కనిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉండి, పని చేయగలిగితే కాన్పు అయ్యే రోజు వరకు విధులకు హాజరు కావొచ్చు. ఆ తర్వాత ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. గరిష్ఠంగా సెలవులు వాడుకోదల్చుకోని వాళ్లు, ఆరోగ్యం బాగున్నవాళ్లు ప్రసూతి తర్వాత 18 వారాలు పూర్తికాక ముందే విధులకు హాజరుకావొచ్చు. ప్రసవానికి ముందు ఎనిమిది వారాలే సెలవు తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. వైద్యులు విశ్రాంతి అవసరమని సూచిస్తే ఎనిమిది వారాల కన్నా ముందు నుంచే సెలవులు తీసుకోవచ్చు.
సెలవులు పొడిగించుకోవచ్చా?
ప్రసూతి సెలవులు గరిష్ఠంగా 26 వారాలూ ఉపయోగించుకున్న తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ పొడిగించుకోవచ్చు. కొంతమంది ప్రసవ సమయంలో అరుదైన అనారోగ్య సమస్యలకు గురవుతారు. వాటికి చికిత్స, విశ్రాంతి ఎక్కువ అవసరం. బిడ్డకు కానీ, తల్లికి కానీ అలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ చట్టం ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించదు. కానీ, ఆర్జిత సెలవులతో లేదా వేతనం లేని సెలవులతో ప్రసూతి సెలవులను మరో 26 వారాలు పొడిగించుకోవచ్చు. గరిష్ఠంగా 52 వారాల వరకు ఈ చట్టం ద్వారా సెలవులు పొందవచ్చు.
సెలవులు, వేతనం ఇవ్వకపోతే ఏం చేయాలి?
ప్రసూతి సెలవులు, వేతనం వర్తించకుండా ఏదైనా సంస్థ ఉద్యోగులతో నియామక సందర్భంలో ఒప్పందం చేసుకుంటే చట్టరీత్యా నేరం. ఇలాంటి నిబంధనలతో నియామక పత్రాలు ఇస్తే వాటిని తిరస్కరించాలి. సంతకం చేయకూడదు. ఆ ఒప్పంద ప్రతిపాదన పట్ల అసమ్మతి తెలియజేస్తూ యాజమాన్యానికి ఉత్తరం రాయాలి. కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేబర్ కమిషనర్ని లేదా కోర్టుని ఆశ్రయించాలి. కొన్ని ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఈ నిబంధనలు సంపూర్ణంగా పాటించడం లేదు. ఇలాంటి సంస్థలు ప్రసూతి సెలవులు నిరాకరించినప్పుడు ప్రభుత్వ సంస్థ అయితే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రైవేటు సంస్థలు అయితే కార్మిక శాఖకు కంప్లయింట్ చేయొచ్చు. అక్కడ న్యాయం జరగకపోతే కోర్టుని ఆశ్రయించవచ్చు.
ప్రసూతి సెలవుల చట్టం 1961
పనిచేసే మహిళలకు మానవీయ వసతులు కల్పించాలని, న్యాయపరమైన నిబంధనలు ఉండాలని, ప్రసవ సమయంలో పని నుంచి వెసులుబాటు కల్పించాలని, ప్రభుత్వం ఇతర ప్రయోజనాలు కల్పించాలని భారత రాజ్యాంగం, ఆర్టికల్ 42 స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1952లో తన 103వ సమావేశంలో ప్రసూతి రక్షణ కల్పించాలని నిర్ణయించింది. దానికి లోబడి భారత ప్రభుత్వం 1961లో ప్రసూతి ప్రయోజన చట్టం తెచ్చింది. 2016లో ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసింది.