మహిళలు నాయకత్వం వహిస్తున్న భారతీయ కంపెనీలు లాభాల బాటలో నడుస్తున్నాయి. సదరు సంస్థలు 50 శాతం అధిక లాభాలు సాధించినట్టు ‘మార్చింగ్ షీప్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2025’ నివేదిక చెబుతున్నది. అదే సమయంలో నాయకత్వ పాత్రల్లో లింగ అంతరాన్ని కూడా ఈ సర్వే బయటపెట్టింది. ఇందులో భాగంగా స్టీల్, ఫార్మాతోపాటు బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ, ఐటీ.. ఇలా 30 రంగాల్లోని 840 లిస్టెడ్ కంపెనీలను అధ్యయనం చేశారు. వీటిలో మహిళల నాయకత్వంలో పనిచేస్తున్న కంపెనీలు 50 శాతం మెరుగైన లాభాలను అందుకున్నట్టు గుర్తించారు. మిగతా సంస్థల్లో కీలక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం ఏమాత్రం మెరుగ్గా లేనట్టు తేల్చారు.
ప్రాతినిధ్యంలోనే కాదు, నిర్ణయం తీసుకునే స్థాయిల్లోనూ మహిళా ఉద్యోగులపై తీవ్రమైన వివక్ష కనిపిస్తున్నట్టు అధ్యయనకారులు వెల్లడించారు. 63.45 శాతం కంపెనీల్లో కీలక నిర్వాహక స్థానాల్లో మహిళలకు చోటు దక్కలేదని చెప్పుకొచ్చారు. ఆయా కంపెనీల్లో మొత్తం ఉద్యోగుల్లో.. మహిళలు కేవలం 22 శాతం మాత్రమే ఉన్నారు. ఇది పీరియాడిక్ అర్బన్ లేబర్ ఫోర్స్ సర్వే (2023-24) నివేదించిన 28 శాతం కంటే తక్కువ. కార్పొరేట్ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు తదితర విషయాల్లో మద్దతు కరువవుతున్నది. అందుకే, సంస్థల్లో మహిళల సంఖ్యను పెంచితే సరిపోదనీ.. నిర్ణయాధికారాల స్థానంలో వారికి చోటు కల్పించాలని అధ్యయనకారులు చెబుతున్నారు.