న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహకంగా జరిగిన 56వ యూరోపియన్ బాక్సింగ్ గోల్డ్ టోర్నీలో భారత బాక్సర్లు పసిడి పతకాలతో దుమ్మురేపారు. యూరప్‌లో ప్రాచీన టోర్నీగా గుర్తింపు పొందిన చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఎనిమిది స్వర్ణాలు సహా మూడు రజతాలు, ఒక కాంస్య పతకంతో అదరగొట్టారు. ఈ సీజన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మన బాక్సర్లు..ప్రత్యర్థులను చిత్తుచేస్తూ పతకాలు కొల్లగొట్టారు.
మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహై(75కి), ప్రీతిపవార్(54కి), సాక్షి(51కి), ప్రియ(60కి) పసిడి పతకాలతో మెరువగా, పర్వీన్(65కి) రజతం దక్కించుకుంది. మహిళల 75కిలోల ఫైనల్లో లవ్లీన 5-0తో మెలిస్సా జెమిని(ఇటలీ)పై అలవోకతో గెలువగా, ప్రీతి 5-0తో జెస్సా మార్సెల్(ఫ్రాన్స్)ను చిత్తుచేసింది. సాక్షి 5-0తో మైసూన్ బరెగ(ఫ్రాన్స్)పై గెలువగా, బార్బోర మెక్సోవ(చెక్ రిపబ్లిక్)పై ప్రియ విజయం సాధించింది. పురుషుల కేటగిరీలో జాదుమని సింగ్(55కి), సచిన్(60కి), అంకుశ్(80కి), నరేందర్(90+కి) స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.