Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Indian Athletes | ఆడాలనే కోరికను, గెలవాలనే సంకల్పాన్ని పేదరికం నిలువరించలేకపోయింది. అప్పు చేసి ఒకరు, బాత్రూమ్లు కడిగి మరొకరు, అమ్మ బంగారు నగలు అమ్మి ఇంకొకరు క్రీడా సమరానికి ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఆకలిని భరించారు. కష్టాల్ని వరించారు. చివరికి గెలుపు శిఖరం చేరుకున్నారు. కష్టం వాళ్లది… త్యాగం అమ్మానాన్నలది. గెలుపు దేశానిది. వాళ్లరుణం ఏమిచ్చి తీర్చుకోగలం. అభినందించి.. మరెన్నో పతకాలు గెలవాలని ఆశీర్వదించడం తప్ప! మొన్నటి ఆసియా క్రీడల్లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన కొందరు క్రీడాకారుల గెలుపు కథ ఇది…
పతకం తెచ్చాకే పెళ్లి!
ఆసియా క్రీడల్లో షూటింగ్ క్రీడాకారిణి నీరు గురిపెట్టి తుపాకీ పేలుస్తుంటే వాళ్లమ్మ తన బిడ్డ ప్రతిభను టీవీలోనో, స్మార్ట్ఫోన్లోనో లైవ్‌లో చూస్తూ లేదు. చూడాలనుకున్నా ఆమెకు ఆ రెండూ లేవు. నీరు తుపాకీ గురిపెట్టి కాల్చే సమయంలో వాళ్లమ్మ ఒక రేషన్ షాప్ ఎదుట వరుసలో నిలుచుని ఉంది. తన బిడ్డ బంగారు పతకం గెలిచిన సంగతి కూడా ఆ తల్లికి తెలియదు. ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకు ఇచ్చే గోధుమలు తీసుకునేందుకు తనవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నది అప్పుడు!
నీరు వాళ్లది హర్యానా రాష్ట్రం, జింద్ జిల్లాలోని సంగత్పుర గ్రామం. వాళ్ల నాన్న సురేశ్ దండా పేద రైతు. ఒక చిన్న గదిలో కుటుంబం మొత్తం ఉంటున్నది. ఆ గదికి ముందున్న వరండాలో కట్టేసిన బర్రెలే వాళ్లకు జీవనాధారం. పాలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. తన కూతురు నీరు దండాకు షూటింగ్ గేమ్ ఇష్టం. అది ఖరీదైన ఆట. వాళ్లు పేదవాళ్లు. కాబట్టి మొదట్లో ఆమెను ఇంట్లోవాళ్లు ప్రోత్సహించలేదు. నీరూకి తుపాకీ కాల్చాలనే ఆసక్తి ఉండేది. అది కొనుక్కునే స్తోమత లేదు. ఆసక్తితో ఇతరుల తుపాకీ అడిగి షూటింగ్ నేర్చుకున్నది. బంధువు సాంబిర్ షెరోన్ వాళ్ల అమ్మకు నచ్చజెప్పి ప్రోత్సహించాడు. నీరూకి కావాల్సిన క్రీడా సామాగ్రిని సమకూర్చాడు. అలా ఏడేండ్ల క్రితం నీరు షూటింగ్ మొదలుపెట్టింది. ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందేందుకు డబ్బులు కట్టలేక, షూటింగ్ రేంజ్‌లోకి పోకుండా గోడలపై కూల్ డ్రింక్స్ అల్యూమినియం క్యాన్లను లక్ష్యంగా చేసుకుని గురిపెట్టేది. ఇలా మొదలైన ఆమె ప్రయాణం ఆసియా క్రీడల వరకు ఒడుదొడుకులతోనే సాగింది.

Neeru Dhanda
రంగుల్లేని గోడల నిండా పతకాలే..
కుటుంబం, సోంబిర్ షెరోన్ వల్ల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణకు ఎంపికైంది నీరు. ఏడాది క్రితం ఆర్మీకీ ఎంపికైంది. ఉద్యోగం రాగానే పెండ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి మొదలైంది. ఆసియా, ఒలింపిక్ క్రీడల్లో పతకం గెలిచిన తర్వాతే పెండ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. పెండ్లిని వాయిదా వేయగలిగింది. కానీ, పతకం గెలుచుకోగల అవకాశాన్ని వాయిదా వేయలేదు. ఏషియన్ గేమ్స్‌కి ఎంపికైన క్రీడాకారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక క్యాంప్ నిర్వహించింది. క్రీడాకారులందరూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటే నీరు మాత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందాల్సి వచ్చింది. ఆసియా క్రీడలు మొదలైన నాలుగు రోజుల తర్వాత జపాన్ చేరుకుంది. చెప్పినట్టే బంగారు పతకం గెలిచి కుటుంబాన్నే కాదు దేశాన్నీ మెప్పించింది. ఆసియా క్రీడల్లో ట్రాప్ షూటింగ్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా చరిత్రకెక్కింది. అంతేకాదు మిక్స్డ్ ట్రాప్‌లో మరో స్వర్ణ పతకం గెలిచింది. ఆసియా క్రీడలే కాదు అనేక పోటీల్లో షూటింగ్లో గెలిచిన పతకాలు, జ్ఞాపికలతో..
రంగుల్లేని ఆ ఇంటి గోడలను నీరు అలంకరించింది!

Aslam Inamdar
టాయ్లెట్లు కడిగి.. ఆకలిని గెలిచి
ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన పురుషుల కబడ్డీలో జట్టులో సభ్యుడైన అస్లాం ఇనామ్దార్ విజయాన్ని గ్రామీణ నేపథ్యం, పేదరికం ఆపలేకపోయాయి. తనకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. కానీ, పేదవాడు. ఆటలు ఆడాలంటే డబ్బు ఖర్చు చేయాలి. ప్రయాణాలు, క్రీడా పరికరాలు, శిక్షణ… డబ్బుల్లేకుండా ఇవేవీ లేవు. ఖరీదైన దుస్తులు, వ్యాయామ పరికరాలు కొనకుండా ఏదైనా ఆటుందా అని చూస్తే..
అతనికి కబడ్డీ, కుస్తీ కనిపించాయి. మహారాష్ట్రలోని అహల్యనగర్ ప్రాంతం వాడైన ఇనామ్దార్ స్థానికంగా జరిగే కబడ్డీ, కుస్తీ పోటీలకు వెళ్లేవాడు. ఈ ఆటైతే ఖర్చు ఉండదు. కండ బలం ఉంటే చాలు. జెర్సీ అడగరు. క్రీడా పరికరాలు కొనాల్సిన అవసరమే లేదని ఈ ఆటలోకి దిగాడు. కొంత బాగా ఆడుతున్నాడనే పేరు రాగానే శిక్షణ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. దానికి కూడా డబ్బుల్లేవు. ఆ స్థితిలో చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించేవాడు. పగటిపూట బాత్రూమ్లు, టాయ్లెట్లు క్లీన్ చేసేవాడు. సాయంత్రం శిక్షణ తీసుకునేవాడు. ఇంట్లో తినడానికి తిండి లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు గెలిచాడు.

Ancy Sojan
సూపర్ ఆన్సీ!
కేరళ రాష్ట్రం, త్రిసూర్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో ఆన్సీ సోజన్ పుట్టింది. చేపల వేట ఆ ఊరి వాళ్లకు ప్రధానమైన జీవనాధారం. ఆన్సీ వాళ్ల నాన్న ఆటో డ్రైవర్. తను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న సముద్ర తీరానికి తీసుకుపోయేవాడు. మెత్తని ఇసుకపై తనను లాంగ్ జంప్ చేయించేవాడు. అలా పరుగులో వేగాన్ని అందుకుంటూ జంప్‌లోనూ దూరం పెంచుకుంటూ పోయింది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో నెగ్గింది. ఇండియన్ నేవీలో క్రీడాకారుల కోటాలో ఉద్యోగం సాధించింది.
ఏడాదిగా అనారోగ్యం
నాలుగేండ్ల క్రితం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పద్నాలుగో స్థానంలో నిలిచింది ఆన్సీ. మూడేండ్ల క్రితం జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది. ఏడాది క్రితం ఆసియా చాంపియన్‌షిప్‌లో 6.33 మీటర్ల దూరం దూకి వెండి పతకం గెలిచింది. తన సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుచుకుని ఈ ఆసియా క్రీడల్లో 6.53 మీటర్లు దూరం జంప్ చేసి వెండి పతకం సాధించింది. కేవలం రెండు సెంటీమీటర్ల తేడాతో బంగారు పతకం కోల్పోయింది. ఎంతో పట్టుదలతో పతకం సాధించాలని ఆన్సీ సాధన చేయలేదు. పోరాటం చేసింది. ఏడాది కాలంగా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నదామె.
మందులు తీసుకుంటూ, వాటికి తగిన ఆహారాన్ని మాత్రమే తింటూ నాన్న కలలు పండించింది. ఇవేవీ నెటిజన్లు మాకు పట్టవన్నట్టుగా.. ‘ఆ చెవులకు నగలేంటి? అంతపొడవాటి జుట్టేంటి? హెయిర్ పిన్నులు, నెక్లెస్, రిస్ట్ బ్యాండ్… ఇదేమన్నా పెండ్లా? పేరంటమా? ఈ నగల ప్రదర్శన ఏంది? అందం మీద శ్రద్ధ పెట్టుండకపోతే ఇంకో రెండు సెంటీమీటర్లు దూకేదానివి. బంగారు పతకం గెలిచేదానివి’ అంటూ ఆమె మీద విమర్శలు ఎక్కుపెట్టారు’! కానీ ఆన్సీ ఆ తిట్లేవీ పట్టించుకోలేదు.
‘క్రీడాకారులకు ఫ్యాషన్ ఉండకూడదని లేదు. ఉంటే ఆ ఫ్యాషన్‌ని చంపే ప్రయత్నం చేయొద్దు. అది క్రీడా సామర్థ్యాన్ని తగ్గించలేదు. ఆ తిట్లేవీ నేను పట్టించుకోను’ అని ఆన్సీ సోజన్ అంటున్నది. ఆన్లైన్ ట్రోలింగ్‌ని ఆపేందుకు కేరళ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ‘స్టాండ్ విత్ ఆన్సీ’ పేరుతో ఆన్లైన్ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చింది. షూటర్ మను బాకర్, హీనా సింధు ఆన్సీకి మద్దతు పలికారు. బూతులు మాట్లాడేవాళ్లు ఆడపిల్లల్నే టార్గెట్ చేయడాన్ని ఖండించారు.

Lalremsiami Hmarzote
గెలుపే లక్ష్యంగా
‘మీ నాన్న హఠాత్తుగా చనిపోయారని సమాచారం వచ్చింది. నువ్వు వెంటనే ఇండియాకు వెళ్లాలి. మిజోరంలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనే ఏర్పాటు చేశాం. తక్షణమే నువ్వు బయలుదేరు’ అని కోచ్ అన్నారు. ఆ మాటలు విన్న భారత మహిళల హాకీ క్రీడాకారిణి లాల్రెమ్సియామి మార్జొటే కుంగిపోలేదు.
‘నేను దేశం కోసం ఆడతాను. ఆడిన తర్వాత వెళ్తాను’ అని బదులిచ్చింది. ఏడేండ్ల క్రితం జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన సెమీ ఫైనల్లో చిలీతో తలపడిన మ్యాచ్‌లో ఇండియా 4-2 స్కోర్‌తో విజయం సాధించింది. ఆ గెలుపులో లాల్రెమ్సియామిది కీలకమైన పాత్ర. ఇప్పుడు అదే జపాన్ గడ్డపై జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత జట్టు గెలుపులో తనదే కీలక భాగస్వామ్యం. ఒక గోల్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పడమే కాదు భారత హాకీ జట్టుకి ఎన్నో ఏండ్లు కలగా మిగిలిన ఒలింపిక్ అర్హతను సాధించిపెట్టింది. ఇంతకన్నా కావాల్సిందేముంది?
ఒట్టి కర్రతో.. బూట్లే లేకుండా..
లాల్రెమ్సియామి మిజోరం రాష్ట్రంలోని కొలాసిబ్ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగింది. కుటుంబంలో, స్నేహితులు తనను ‘సియామి’ అని పిలుస్తారు. ఆ ఊళ్లో పెద్ద మైదానం లేదు. మిజోరంలో మొత్తంలో మూడే హాకీ గ్రౌండ్స్ ఉండేవి. కొన్నిచోట్ల ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోనే ఆడేవాళ్లు. స్కూల్లో చదివే రోజుల్లో లాల్రెమ్సియామి సాధారణ కర్రలతో హాకీ ఆడటం మొదలుపెట్టింది. మట్టిలో కాళ్లకు బూట్లు, సాక్సులు లేకుండా ఆట మొదలుపెట్టింది. పదకొండేండ్ల వయసులో ఉన్నప్పుడు హాకీ నేర్చుకోవడానికి అకాడమీలో చేరతానని తల్లిదండ్రులతో చెప్పింది. వాళ్లకు హాకీ అంటే ఏమిటో అర్థం కాలేదు.
కొండప్రాంతాల్లో హాకీ ఆడేందుకు అవకాశం లేదు. ఆడేవాళ్లు కనిపించరు. కాబట్టి హాకీ నేర్చుకోవడం కోసం థెంజల్ పట్టణంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా సంస్థలో చేరింది. అది వాళ్ల ఊరుకి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండప్రాంతాల్లో నివసించడం వల్ల ఆ కొండ దిగేసరికే ఆమె అలసిపోయేది. ఆ తర్వాత మైదానాల్లో కష్టం అనుకోకుండా సాధన చేసేది. ఆ కష్టమే ఆమెను ఇండియా అండర్ 18 జట్టుకి ఎంపికయ్యే సామర్థ్యాన్నిచ్చింది. ఏడాదిలోనే సీనియర్స్ జట్టులో స్థానం దక్కించుకుంది. యూత్ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో ఆడింది. మిజోరం నుంచి మొదటిసారి ఒలింపిక్ ఆడే వ్యక్తిగా గుర్తింపు దక్కించుకుంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఇరవై అరు సంవత్సరాల సియామి ఏ పతకం తెస్తుందో చూద్దాం.

Vidya
చెల్లెలి సాయం.. అక్క సాహసం!
విద్య, నిత్య కవలలు. వాళ్లిద్దరికీ ఆటలంటే ఇష్టం. వాళ్ల నాన్న ట్రక్ డ్రైవర్. షూ కొనివ్వమని తండ్రిని అడిగారు. అప్పు చేసి ఆ బిడ్డల కోరిక తీర్చాడు. కాలికి షూ తొడిగిన తర్వాత విద్య చిరుతలా మారిపోయింది. మెరుపు వేగంతో దూసుకుపోయింది. బయట శిక్షణ తీసుకుని సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంది. తండ్రి పేదరికం విద్య ప్రయాణానికి బ్రేకులు వేశాయి. అయితే సోదరి నిత్య చేదోడుగా నిలిచింది. తను ఉద్యోగం చేస్తూ నెలనెలా వచ్చే జీతం డబ్బులు విద్యకు పంపిస్తూ ఉండేది.
విద్యకు అవసరమైన శిక్షణ, సప్లిమెంట్స్, ట్రావెల్, వసతి ఖర్చులకు లోటు లేకుండా చూసుకుంది. విద్య ఎన్నో ఏండ్లుగా పీటీ ఉష పేరిట ఉన్న నాలుగు వందల మీటర్ల హార్డిల్స్‌లో రికార్డ్‌ని తిరగరాసింది. ఆసియా క్రీడల్లో నాలుగు వందల మీటర్ల రిలే పరుగులో బంగారు పతకం, నాలుగు వందల మీటర్ల హార్డిల్స్‌లో కాంస్యపతకం సాధించింది. నాలుగు వందల మీటర్ల హార్డిల్స్‌లో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు 50 నుంచి 51 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. విద్య ఇప్పుడు 54 నుంచి 55 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నది.

Sahil
అమ్మ నగలమ్మి..
కొడుకు గెలుస్తాడనే ఆశతో వాళ్లమ్మ బంగారు నగలు అమ్మి క్రీడాకారులు ఉపయోగించే ప్రొఫెషనల్ బౌ (విల్లు)ని కొనిచ్చింది. చాలాఏండ్లు సాధన చేశాడు. గెలుపు కోసం ఎదురుచూశాడు. అప్పులు చేశాడు. కానీ గెలుపు రాలేదు. ఇంతకంటే ముందుకు పోలేను అనే నిరాశలో ఆర్చరీని పూర్తిగా వదిలేశాడు.
ఆర్చరీ అంటే విల్లుని ఎక్కుపెట్టి తథేకంగా చూస్తూ గురి కుదర్చడమే కాదు. ఏండ్లపాటు సాధన చేయాలి. గెలుపు కోసం ఎదురు చూడాలి. పేదరికంలో ఉన్న సాహిల్ ఎక్కువ కాలం ఎదురుచూడలేక పోయాడు. విల్లుని వదిలేశాడు. కోచ్, సహచరులు, కుటుంబం తనను ప్రోత్సహించింది. వాళ్లందరి ప్రోత్సాహంతో అకాడమీలో తనను తాను మెరుగులు దిద్దుకుంటూ పోయాడు. తన నగలు అమ్మి విల్లుని చేతికి ఇచ్చిన తల్లికి ఆ కొడుకు ఆసియా క్రీడల నుంచి రెండు బంగారు పతకాలు కానుకగా తెచ్చాడు. కాంపౌండ్ ఆర్చరీ పురుషుల జట్టు, కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో బంగారు పతకాలు గెలవడమే కాదు లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌కి అర్హత సాధించాడు.

Kumkum Mohod
సెకండ్ హ్యాండ్ విల్లుతో సాధన
కుంకుమ్ మహోద్ స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. కుంకుమ్ బంధువుల అమ్మాయి ఆర్చరీలో శిక్షణ పొందింది. ‘ఆ అమ్మాయిలాగా నువ్వూ ఆర్చరీ నేర్చుకోవాలి’ అని కుంకుమ్ని వాళ్లమ్మ రూపాలి ప్రోత్సహించింది. కోచ్ ప్రఫుల్ డాంగేకి పరిచయం చేసింది. ఆయన కుంకుమ్ భుజ నిర్మాణం, ఛాతీ వైశాల్యం చూసి ఆమె ఆర్చరీకి అనువైన దేహాన్ని కలిగి ఉన్నదని గుర్తించాడు. ప్రారంభంలోనే పట్టుదలతో నేర్చుకోవడం చూసి కచ్చితంగా గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతుందని తల్లిదండ్రులకు చెప్పాడు. ఎనిమిదేండ్ల క్రితం కుంకుమ్ ఆర్చరీలోకి అడుగుపెట్టింది. కరోనా సమయంలో విలు విద్యలో ప్రత్యేక శిక్షణ పొందింది.
చెక్క విల్లుతో
కుంకుమ్ మొదట్లో చెక్కతో తయారు చేసిన విల్లుతో బాణాలు సంధించేది. క్రీడాకారులు ఉపయోగించే విల్లు ఖరీదు మూడు వేల రూపాయలు. తన తండ్రి అనిల్ మనోహర్ పేదవాడు. స్వీట్ షాప్‌లకు అట్టలతో బాక్స్‌లను తయారుచేసి ఇస్తుంటాడు. వచ్చే ఆదాయంలో నయా పైసా మిగిలేది కాదు. కుంకుమ్ కోరిక తీర్చడానికి వాళ్ల నాయనమ్మ ఒక విల్లుని కొనిచ్చింది. విల్లు చేతికి వచ్చిందో లేదో ఆరు నెలల్లోనే జాతీయ స్థాయి జూనియర్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకం గెలిచింది కుంకుమ్. ఆ విజయంతో తన కూతురికి ఎలాగైనా సహకరించాలని అమ్మానాన్న అనుకున్నారు.
షేర్ ఆటోలో ప్రయాణం
ఖేలో ఇండియా శిక్షణకు ఎంపికైంది కుంకుమ్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గ విల్లు కొనే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ విల్లుని కొనుగోలు చేశాడు వాళ్ల నాన్న. అయిదేండ్లుగా ఆ పాత విల్లుతోనే సాధన చేసింది. శిక్షణ కోసం తెల్లవారు జామున షేర్ ఆటో ఎక్కిపోయేది. తనతోపాటు శిక్షణకు వచ్చే పిల్లలు మానేయడంతో ఆటో రావడం ఆగిపోయింది. ఆర్థికంగా భారమైనా బైక్ మీద రోజూ దింపి వచ్చేవాడు కుంకుమ్ తండ్రి. కుటుంబ ప్రోత్సాహంతో పేదరికాన్ని గెలిచిన బిడ్డ ఏకంగా మూడు మెడల్స్ అందుకున్నది.
ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. అది కూడా పదిహేడేండ్ల వయసులో సాధించిన విజయం మరో అద్భుతం! మహిళల టీమ్ రికర్వ్ ఆర్చరీలోనూ మరో బంగారు పతకం గెలిచింది. మిక్స్డ్ ఆర్చరీలో వెండి పతకం కూడా గెలిచింది. మొత్తంగా మూడు పతకాలు గెలిచిన కుంకుమ్ పేద తల్లిదండ్రుల కష్టానికి మించిన ఫలితాన్ని తెచ్చింది. గతంలో జరిగిన ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఉమెన్స్ ఆర్చరీ టీమ్ రికర్వ్‌లో బంగారు పతకం గెలుచుకొచ్చింది. ఆర్చరీ మిక్స్డ్ రికర్వ్‌లో వెండి పతకం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

