e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News కివీస్‌ దీటుగా..

కివీస్‌ దీటుగా..

  • యంగ్‌, లాథమ్‌ అజేయ అర్ధసెంచరీలు .. తొలి ఇన్నింగ్స్‌ 129/0
  • అయ్యర్‌ అరంగేట్రం సెంచరీ.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 345 ఆలౌట్‌

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ‘కాన్పూర్‌’ టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతుండడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. కివీస్‌ బౌలింగ్‌ దాడిని ఎదుర్కొంటూ అరంగేట్ర టెస్టులో శ్రేయాస్‌ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. సహచర బ్యాటర్లు విఫలమైన చోట సత్తాచాటడంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను తమ స్పిన్‌ మాయాజాలంతో కట్టిపడేదామనుకున్న భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం దక్కలేదు. ఓపెనర్లు విల్‌ యంగ్‌, లాథమ్‌ అజేయ అర్ధసెంచరీలతో వికెట్‌ కోల్పోకుండా దీటుగా జవాబిస్తున్నారు. స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, అక్షర్‌ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయారు.

కాన్పూర్‌: భారత్‌, న్యూజిలాండ్‌ టెస్టు మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతున్నది. ప్రత్యర్థిని తమ స్పిన్‌ తంత్రంతో చుట్టి పడేదామనుకున్న టీమ్‌ఇండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. సుడులు తిరిగే స్పిన్‌తో ఉక్కిరిబిక్కిరి చేద్దామనే భారత ప్రయత్నం ఫలించలేదు. ఓపెనర్లు విల్‌ యంగ్‌(180 బంతుల్లో 75 నాటౌట్‌, 12 ఫోర్లు), లాథమ్‌(165 బంతుల్లో 50 నాటౌట్‌, 4 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలతో రాణించడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. చేతిలో పది వికెట్లు ఉన్న న్యూజిలాండ్‌ ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉన్నది.

- Advertisement -

వీరిద్దరు భారత బౌలింగ్‌ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. ముఖ్యంగా కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న యంగ్‌ చక్కని పరిణతి కనబరిచాడు. స్పిన్‌ త్రయం బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడుతూ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఎలాంటి సహకారం లేని పిచ్‌పై టీమ్‌ఇండియా బౌలర్లు చేష్టలుడిగిపోయారు. వికెట్‌ కోసం భారత్‌ వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు(258/4)తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 345 పరుగులకు ఆలౌటైంది.

అరంగేట్రం బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(171 బంతుల్లో 105, 13ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో కదంతొక్కాడు. కివీస్‌ బౌలర్లను సాధికారికంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించాడు. ఓవైపు అయ్యర్‌ రాణించినా..సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. 87 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఆఖరి ఆరు వికెట్లను కోల్పోయింది. కివీస్‌ సీనియర్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ(5/69) ఐదు వికెట్లతో విజృంభించగా, జెమీసన్‌(3/91) మూడు వికెట్లు తీశాడు.

అయ్యర్‌ అదుర్స్‌

కివీస్‌తో రెండో రోజు ఆటలో భారత్‌కు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. మెరుగైన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. ఓవైపు సెంచరీ హీరో శ్రేయాస్‌ అయ్యర్‌..కివీస్‌ బౌలింగ్‌ దాడిని సమర్థంగా నిలువరిస్తే..మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు కరువైంది. కొత్త బంతితో సౌథీ..జడేజాను ఓవర్‌నైట్‌ స్కోరుతో తిరిగి పెవిలియన్‌ పంపాడు. ఇక్కణ్నుంచి టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ సాహా(1) తీవ్రంగా నిరాశపరిచాడు. సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 288 పరుగులకు భారత్‌ 6 వికెట్లు కోల్పోయింది.

అయ్యర్‌కు అశ్విన్‌(38) జత కలిసిన తర్వాత ఇన్నింగ్స్‌ మళ్లీ కుదటపడింది. వీరిద్దరు సమయోచితంగా ఆడుతూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. ముఖ్యంగా అయ్యర్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు. జెమీసన్‌ బౌలింగ్‌లో కవర్స్‌లో కొట్టిన షాట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అదే జోరులో మరో బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్‌..అభిమానులకు అభివాదం చేశాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు జట్టుకు ఎంపికైన ఈ ముంబైకర్‌ తన తొలి మ్యాచ్‌లోనే కల సాకారం చేసుకున్నాడు. అయితే సెంచరీ సంబురం ఎక్కువ సేపు నిలువలేదు. సౌథీ బౌలింగ్‌లో యంగ్‌ క్యాచ్‌తో అయ్యర్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక్కణ్నుంచి భారత్‌ 40 పరుగుల తేడాతో మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది.

అడ్డుగోడలా: తొలి ఇన్నింగ్స్‌లో ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేసిన న్యూజిలాండ్‌ అదే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, విల్‌ యంగ్‌..భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న యంగ్‌..చక్కని పరిణతి కనబరిచాడు. టీమ్‌ఇండియా స్పిన్‌త్రయం అశ్విన్‌, అక్షర్‌, జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. మరోవైపు మంచి ఫామ్‌మీదున్న లాథమ్‌ మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ, ఒకసారి క్యాచ్‌ ఔట్‌పై రివ్యూలలో లాథమ్‌కు అదృష్టం కలిసొచ్చింది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌(సి)బ్లండెల్‌(బి)జెమీసన్‌ 13, గిల్‌(బి)జెమీసన్‌ 52, పుజార(సి)బ్లండెల్‌(బి)సౌథీ 26, రహానే (బి) జెమీసన్‌ 35, అయ్యర్‌(సి)యంగ్‌(బి)సౌథీ 105, జడేజా(బి)సౌధీ 50, సాహా(సి)బ్లండెల్‌(బి)సౌథీ 1, అశ్విన్‌(బి)పటేల్‌ 38, అక్షర్‌పటేల్‌(సి)బ్లండెల్‌(బి)సౌథీ 3, ఉమేశ్‌ 10 నాటౌట్‌, ఇషాంత్‌(ఎల్బీ) పటేల్‌ 0; ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 111.1 ఓవర్లలో 345 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-21, 2-82, 3-106, 4-145, 5-266, 6-288, 7-305, 8-313, 9-339, 10-345; బౌలింగ్‌: సౌథీ 27.4-6-69-5, జెమీసన్‌ 23.2-6-91-3, పటేల్‌ 29.1-7-90-2, సోమర్‌విల్లే 24-2-60-0, రవీంద్ర 7-1-28-0. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ 50 నాటౌట్‌, యంగ్‌ 75 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 57 ఓవర్లలో 129; బౌలింగ్‌: ఇషాంత్‌శర్మ 6-3-10-0, ఉమేశ్‌యాదవ్‌ 10-3-26-0, అశ్విన్‌ 17-5-38-0, జడేజా 14-4-28-0, అక్షర్‌ 10-1-26-0.

16వ భారత క్రికెటర్‌గా..

అరంగేట్రం టెస్ట్‌ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాటర్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ రికార్డుల్లోకెక్కాడు. కివీస్‌తో కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో అయ్యర్‌ అద్భుత శతకంతో సత్తాచాటాడు. కివీస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ 171 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇలా ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకాన్ని ఖాతాలో వేసుకున్న 16వ భారత బ్యాటర్‌గా అయ్యర్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో లాలా అమర్‌నాథ్‌ మొదటిస్థానంలో ఉండగా, విశ్వనాథ్‌, గంగూలీ, సెహ్వాగ్‌, ధవన్‌, రోహిత్‌శర్మ, పృథ్వీషా ఉన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement