లక్నో: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ విజేతను తేల్చే నాలుగో టీ20 పొగమంచు కారణంగా రద్దయింది. బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ కూడా పడకుండానే అంపైర్లు ఆటను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా లక్నో నగరంపై దట్టమైన పొగమంచు ఆవహించింది.
మంచు ప్రభావంతో మైదానంలో కొద్ది దూరంలో ఉన్నవారు కూడా కనిపించలేకుండా మారింది. పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని 5 సార్లు పర్యవేక్షణకు వచ్చిన అంపైర్లు.. చివరికి రాత్రి 9.30 గంటలకు ఆటను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత జట్టు 2-1 ఆధిక్యంతో ఉంది. సిరీస్‌లో చివరిదైన ఆఖరి టీ20 ఈనెల 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోమారు గాయం బారిన పడ్డాడు. నాలుగో టీ20 ప్రాక్టీస్ సందర్భంగా గిల్ కాలి బొటనవేలికి గాయమైంది. దీంతో లక్నో మ్యాచ్‌తో పాటు అహ్మదాబాద్ టీ20కీ గిల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.