వాషింగ్టన్: ప్రపంచపు తొలి ఎగిరే కారు త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. అలెఫ్ మోడల్ ఏ అల్ట్రాలైట్ కారు ఎనిమిది ప్రొపెల్లర్స్ను ఉపయోగించి, గాలిలో ఎగురుతుంది. ఇవి బూట్, బానెట్లో ఉంటాయి. ఎగరవలసిన అవసరం లేనపుడు ఈ కారు సాధారణంగానే రోడ్డు మీద ప్రయాణిస్తుంది. దీని ధర సుమారు రూ.2.83 కోట్లు ఉండవచ్చు. అమెరికాలోని అలెఫ్ ఏరోనాటిక్స్ ఈ కారును అభివృద్ధి చేయడానికి ఓ దశాబ్దానికిపైగా పట్టింది. త్వరలోనే తొలి కస్టమర్లకు ఈ కార్లను అందజేస్తామని ప్రకటించింది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న ఈ కంపెనీ ప్లాంట్లో ఈ కార్లను హ్యాండ్ అసెంబుల్ చేస్తున్నారు.
వాస్తవ పరిస్థితుల్లో ఈ కార్లను పరీక్షించడం కోసం ముందు కొందరికి మాత్రమే వీటిని అందజేస్తామని ఈ కంపెనీ తెలిపింది. కస్టమర్లకు అందజేయడానికి ముందు కొన్ని నెలలపాటు వీటిని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుందని చెప్పింది. ఇవి సాధారణ రోడ్లపై ప్రయాణించేటపుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించిన తర్వాత వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చునని పేర్కొంది. ఫ్లయింగ్ ట్యాక్సీలకు విమానాశ్రయాలు లేదా వెర్టిపోర్ట్స్ అవసరం. ఫ్లయింగ్ కార్స్కు మాత్రం వాటి అవసరం ఉండదు. ఇవి రోడ్డుపైన, గాలిలో ప్రయాణించగలవు. రెక్కలు లేకుండానే ఎగరగలదు. కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ మాట్లాడుతూ, ఈ కారును నడిపే విధానాన్ని కేవలం 15 నిమిషాల్లో నేర్చుకోవచ్చునని చెప్పారు.