హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అవసరాల నిమిత్తం 160 ఉపగ్రహ ఆధారిత ‘స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్’ (శాట్-సావ్), వాటి అనుబంధ పరికరాల సేకరణ కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)తో రూ. 810.79 కోట్ల విలువైన ఒప్పందంపై బుధవారం సంతకాలు చేసింది. ‘బై (ఇండియన్-ఐడీడీఎమ్)’ క్యాటగిరీ కింద చేపట్టిన ఈ ఒప్పందం న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. రక్షణ రంగంలో స్వావలంబనకు మరింత ఊతమిస్తూ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థను రూపొందించి అభివృద్ధి చేసింది.
గగనతలం నుంచి భూమిపై లక్ష్యాలను ఛేదించే కచ్చితత్వంతో కూడిన ‘శాట్-సావ్’ ైగ్లెడ్ బాంబులను జాగ్వార్, హక్, సుఖోయ్-30 ఎంకేఐ వంటి యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. సుదూర ప్రాంతాల (స్టాండ్-ఆఫ్ రేంజ్) నుంచే శత్రువుల ఎయిర్ ఫీల్డ్‌లు, రన్ వేలను ధ్వంసం చేయడంలో ఇవి విశేష సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ఇనిషియల్ మెజర్మెంట్ యూనిట్, లాంగ్ ఇంపాక్ట్ డిలే ఫ్యూజ్, ట్విన్ స్టోర్ క్యారియర్ వంటి కీలక విడిభాగాలతో కలిపి దాదాపు 60% స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ ఆయుధాల డెలివరీ 2027-28 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్య జరుగనుండగా, వైమానిక దళ అమ్ములపొదిలోకి ఇవి చేరడం ద్వారా సైనిక సంసిద్ధత మరింత పటిష్టమై దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగనున్నది.