భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత హాకీ జట్టు వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది. ద్వితీయ శ్రేణి జర్మనీ జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియా తరఫున సుఖ్జీత్సింగ్(18ని), వరుణ్‌కుమార్(40ని), అభిషేక్(53ని) గోల్స్ చేశారు. బోకెల్ అంటోన్(44ని) జర్మనీకి ఏకైక గోల్ అందించాడు. మొత్తంగా 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో భారత్ 27 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా, జర్మనీ(17), నెదర్లాండ్స్(16) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. జర్మనీపై భారత్ ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో అవకాశాలు లభించినా.. సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత తమదైన జోరు కనబరుస్తూ వరుస గోల్స్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.