ముంబై: భారతీయ కోస్టు గార్డు(Indian Coast Guard)కు చెందిన హెలికాప్టర్ సెప్టెంబర్ 2వ తేదీన అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మరణించిన కమాండెంట్ ఆర్కే రాణా పైలట్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత ఆ పైలట్ మృతదేహం లభ్యమైందని అధికారులు వెల్లడించారు. టెక్నికల్ సమస్య వల్ల ఆ రోజు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హెలికాప్టర్లో నలుగురు ఉన్నారు. అక్టోబర్ 10వ తేదీన పైలట్ రాణా మృతదేహాన్ని వెలికితీసినట్లు భారత కోస్టు గార్డు అధికారి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అతని స్వస్థలం.
పోరుబందర్‌కు చెందిన కోస్టు గార్డు హెలికాప్టర్.. సెప్టెంబర్ 2వ తేదీన ఓ రెస్క్యూ మిషన్‌లో పాల్గొన్నది. సముద్ర తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఆ ప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య ఓడలో అనారోగ్యంతో ఉన్న సెయిలర్‌ను రక్షించేందుకు ఆ హెలికాప్టర్ వెళ్లింది. కానీ రెస్క్యూ సమయంలో ఆ హెలికాప్టర్ కూలింది. ప్రమాదంలో మరణించిన కమాండెంట్ విపిన్ బాబు, ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్ మృతదేహాలను సెప్టెంబర్ 3వ తేదీన రికవరీ చేశారు. ఆ ప్రమాదం నుంచి గౌతమ్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు.