e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News సిరీస్‌ పట్టేశారు..

సిరీస్‌ పట్టేశారు..

  • విరాట్‌ విహంగ విన్యాసం
  • వరుసగా మూడో సిరీస్‌ నెగ్గిన భారత్‌
  • ఆఖరి వన్డేలో 7 పరుగులతో గెలుపు
  • మెరిసిన పంత్‌, హార్దిక్‌, శార్దూల్‌
  • సామ్‌ కరన్‌ పోరాటం వృథా
  • టెస్టు, టీ20 సిరీస్‌లు సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా అదే జోరులో వన్డేల్లోనూ ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. పంత్‌, హార్దిక్‌ పాండ్యా దంచికొట్టడంతో వరుసగా మూడోమ్యాచ్‌లోనూ మూడొందల పైచిలుకు స్కోరు చేసిన భారత్‌.. ఆరంభంలోనే ప్రత్యర్థి టాపార్డర్‌ను కుప్ప కూల్చి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నట్లు కనిపించింది. అయితే ఆఖర్లో ఫీల్డింగ్‌ తప్పిదాలకు సామ్‌ కరన్‌ వీరోచిత పోరాటం తోడవడంతో ఒక దశలో పరాజయం తప్పదనిపించినా.. ఆఖర్లో ఒత్తిడిని జయించిన కోహ్లీ అండ్‌ కో విజయం పరిపూర్ణం చేసుకుంటే.. పర్యాటక జట్టు రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది.

పుణె: ఉత్కంఠ పోరులో భారత్‌దే పైచేయి అయింది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ (83 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) భయపెట్టినా.. బ్యాట్స్‌మెన్‌ సమిష్టి కృషికి బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో చివరి వన్డేలో నెగ్గిన టీమ్‌ఇండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లు గెలుచుకున్న కోహ్లీసేన.. వన్డేల్లోనూ ఇంగ్లండ్‌కు ఉత్తిచేతులనే మిగిల్చింది. ఆదివారం ఇక్కడి ఎమ్‌సీఏ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట భారత్‌ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ధావన్‌ (67; 10 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సామ్‌ కరన్‌ పోరాటానికి ముందు డేవిడ్‌ మలన్‌ (50) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 4, భువనేశ్వర్‌ 3 వికెట్లు పడగొట్టారు.

తలాకొన్ని..
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. శిఖర్‌ ధావన్‌తో పాటు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (37; 6 ఫోర్లు) చక్కటి క్రికెటింగ్‌ షాట్లు ఆడటంతో 14 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ సెంచరీ మార్క్‌ చేరింది. ఈ క్రమంలో ధావన్‌ అర్ధశతకం పూర్తి చేసుకోగా.. ఆదిల్‌ రషీద్‌ ఇంగ్లండ్‌కు బ్రేక్‌త్రూ ఇప్పించాడు. రషీద్‌ తదుపరి ఓవర్‌లో ధావన్‌ అతడికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా.. ఈ మధ్యలో విరాట్‌ కోహ్లీ (7)ని మొయిన్‌ అలీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. రిషబ్‌ పంత్‌ నిధానంగా ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తే.. మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డ లోకేశ్‌ రాహుల్‌ (7).. మొయిన్‌ అలీ పట్టిన చక్కటి క్యాచ్‌కు పెవిలియన్‌ బాటపట్టాడు. పంత్‌కు హార్దిక్‌ పాండ్యా జతకలవడంతో.. అగ్నికి వాయువు తోడైనైట్లెంది. లివింగ్‌స్టోన్‌ ఓవర్‌లో పంత్‌ 6,4 కొడితే.. అలీ ఓవర్‌లో హార్దిక్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు అరుసుకున్నాడు. రషీద్‌ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో పంత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన పంత్‌ను సామ్‌ కరన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో 99 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కృనాల్‌ పాండ్యా (25), శార్దూల్‌ (21 బంతుల్లో 30; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించడంతో భారత్‌ మూడొందల మార్క్‌ దాటింది.

అతనొక్కడే..
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. జోరుమీదున్న జాసన్‌ రాయ్‌ (14)ను భువనేశ్వర్‌ తొలి ఓవర్‌లోనే ఔట్‌ చేశాడు. కాసేపటికే బెయిర్‌స్టో (1) కూడా అతడికే చిక్కాడు. ఈ దశలో బెన్‌ స్టోక్స్‌ (35), బట్లర్‌ (15) కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ 95 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ మలన్‌తో పాటు లివింగ్‌స్టోన్‌ (36), మొయిన్‌ అలీ (29) కాస్త పోరాడారు. ఫలితంగా 31 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌ 200/7తో నిలిచింది. ఇంకేముంది మిగిలిన మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ సిరీస్‌ పట్టేయడానికి ఇంకెంతో సమయం పట్టదనుకుంటే.. సామ్‌ కరన్‌ అద్వితీయ పోరాటంతో టీమ్‌ఇండియాను వణికించాడు. రషీద్‌ ((19), మార్క్‌ వుడ్‌ (14)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేస్తూ మ్యాచ్‌ను చివరి వరకు తెచ్చాడు. ఇంగ్లండ్‌ విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు అవసరమైన దశలో శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 47వ ఓవర్‌లో సామ్‌ కరన్‌ 2,4,6,2,4తో 18 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 18 బంతుల్లో 23కు మారింది. ఈ దశలో భువనేశ్వర్‌, హార్దిక్‌, నటరాజన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి భారత్‌ను గెలిపించారు.

67 ఈ సిరీస్‌లో నమోదైన సిక్సర్ల సంఖ్య. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇవే అత్యధికం. 2019లో న్యూజిలాండ్‌, శ్రీలంక సిరీస్‌లో నమోదైన 57 సిక్సర్ల రికార్డు
తెరమరుగైంది.

3 200 అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మూడో భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ధోనీ (322), అజారుద్దీన్‌ (221) ముందున్నారు.

6 స్వదేశంలో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఆరో వన్డే సిరీస్‌ విజయం.

స్కోరు బోర్డు
భారత్‌: రోహిత్‌ (బి) రషీద్‌ 37, ధావన్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 67, కోహ్లీ (బి) అలీ 7, పంత్‌ (సి) బట్లర్‌ (బి) సామ్‌ 78, రాహుల్‌ (సి) అలీ (బి) లివింగ్‌స్టోన్‌ 7,హార్దిక్‌ (బి) స్టోక్స్‌ 64, కృనాల్‌ (సి) రాయ్‌ (బి) వుడ్‌ 25, శార్దూల్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 30, భువనేశ్వర్‌ (సి) సామ్‌ (బి) టాప్లే 3, కృష్ణ (బి) వుడ్‌ 0, నటరాజన్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 48.2 ఓవర్లలో 329. వికెట్ల పతనం: 1-103, 2-117, 3-121, 4-157, 5-256, 6-276, 7-321, 8-328, 9-329, 10-329, బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 5-0-43-1, టాప్లే 9.2-0-66-1, వుడ్‌ 7-1-34-3, స్టోక్స్‌ 7-0-45-1, రషీద్‌ 10-0-81-2, మొయిన్‌ అలీ 7-0-39-1, లివింగ్‌స్టోన్‌ 3-0-20-1.
ఇంగ్లండ్‌: రాయ్‌ (బి) భువనేశ్వర్‌ 14, బెయిర్‌స్టో (ఎల్బీ) భువనేశ్వర్‌ 1, స్టోక్స్‌ (సి) ధావన్‌ (బి) నటరాజన్‌ 35, మలన్‌ (సి) రోహిత్‌ (బి) శార్దూల్‌ 50, బట్లర్‌ (ఎల్బీ) శార్దూల్‌ 15, లివింగ్‌స్టోన్‌ (సి అండ్‌ బి) శార్దూల్‌ 36, మొయిన్‌ (సి) హార్దిక్‌ (బి) భువనేశ్వర్‌ 29, సామ్‌ కరన్‌ (నాటౌట్‌) 95, రషీద్‌ (సి) కోహ్లీ (బి) శార్దూల్‌ 19, వుడ్‌ (రనౌట్‌) 14, టాప్లే(నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 50 ఓవర్లలో 322/9. వికెట్ల పతనం: 1-14, 2-28, 3-68, 4-95, 5-155, 6-168, 7-200, 8-257, 9-317, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-42-3, నటరాజన్‌ 10-0-73-1, ప్రసిద్ధ్‌ 7-0-62-0, శార్దూల్‌ 10-0-67-4, హార్దిక్‌ 9-0-48-0, కృనాల్‌ 4-0-29-0.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిరీస్‌ పట్టేశారు..

ట్రెండింగ్‌

Advertisement