హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో లెస్బియన్, గే, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)ల నివాసం కోసం ప్రత్యేక భవనాలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఆ కమ్యూనిటీ కోసం కో లివింగ్ స్పేస్‌ను అందించడానికి నగరానికి చెందిన హాబిటాట్ ఇంక్ సంస్థ ముందుకొచ్చింది. ఇంక్ ఫౌండర్స్ అంకిత్ నారాయణన్, మురారీ కుమార్‌రాజా, ప్రతాప్ జేమ్స్.. వారి కష్టాలను అర్థం చేసుకొని వారికోసం ప్రత్యేకంగా కో-లివింగ్ స్పేస్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో అయ్యప్ప సొసైటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. ఇవి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సింగిల్ బెడ్రూం, డబుల్ బెరూం, అటాచ్డ్ బాత్రూంలతో సరసమైన ధరలతో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఎల్జీబీటీక్యూ తమ కమ్యూనిటీ ఈవెంట్లు జరుపుకొనేలా వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.