హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): ప్రముఖ సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్(ఏఈయూ) తరలిపోతున్నదన్న వార్తలను కంపెనీ సీఈవో రఘు ఫణికర్ కొట్టిపారేశారు. కొంగర్‌కలాన్ వద్ద రూ.2,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఈ నెల 23న ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ) యూనిట్ ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ పరిశీలనలో ఉన్నదని, ఐఎస్ఎం అనుమతి రాగానే ఈ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఫణికర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకుగాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో యూనిట్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గత మార్చిలో సంస్థ నిర్మాణ పనులను అర్ధాంతంగా నిలిపివేసింది. దీంతో ఈ యూనిట్ గుజరాత్‌కు తరలివెళ్లనున్నట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. గుజరాత్‌లోని సనంద్ వద్ద రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఓఎస్ఏటీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు, కొంగర్‌కలాన్ వద్ద చేపట్టిన ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్ఛరింగ్ సర్వీసెస్(ఈఎంఎస్) యూనిట్‌గా మార్చివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.