మాస్కో 19: ఉక్రెయిన్‌పై తొలిసారిగా హైపర్‌సానిక్ క్షిపణి కింజాల్ను ప్రయోగించినట్టు రష్యా సైన్యం శనివారం వెల్లడించింది. ఇవానో-ఫ్రాంకివిస్క్ నగరంలో భూగర్భంలో ఉన్న ఆయుధ గోదాంను కింజాల్ సాయంతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. దీంతో పాటు నల్ల సముద్రానికి ఆనుకొని ఉన్న ఒడెసాలో ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేయడానికి యుద్ధ నౌక విధ్వంసక క్షిపణి వ్యవస్థ అయిన బాస్టియన్‌ను ఉపయోగించినట్టు పేర్కొన్నది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మైకోలేవ్ నగరంలో సైనిక స్థావరంపై రష్యా బాంబుదాడులకు పాల్పడింది. దాడుల్లో 50కి పైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. దాడులు జరిగిన సమయంలో స్థావరంలో దాదాపు 200 మంది సైనికులు ఉన్నారు. కీవ్‌లో జరిపిన దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపో యారు. మరియుపోల్‌లో యుద్ధం నగరం మధ్యకు చేరుకొన్నది. నగరంలో 80% భవనాలు పూర్తిగా ధ్వం సం అయ్యాయని, యుద్ధం ఆగితేనే శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీయడానికి వీలు కలుగుతుందని స్థానిక అధికారులు చెప్పారు.
ఐరోపాలోనే అతిపెద్ద లోహ కర్మాగారం అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంటును రష్యా బలగాలు శనివారం స్వాధీనం చేసుకొన్నాయి. పౌరుల తరలింపునకు 10 మానవతా కారిడార్లు ఏర్పాట్లు చేయనున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. మరియుపోల్, కీవ్ నగరాల నుంచి కూడా పౌరులను తరలిస్తామని పేర్కొన్నది. యుద్ధం కారణంగా పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడుతుందని దక్షిణ యూరప్ దేశాలు భయపడుతున్నాయి. ఈ దేశాలకు పశుగ్రాసం ప్రధానంగా ఉక్రెయిన్ నుంచే వస్తున్నది. రష్యాతో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని పోలండ్ దేశం యూరోపియన్ యూనియన్‌కు ప్రతిపాదన చేసింది.
ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించం: అమెరికా
ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించబోమని అమెరికా మరోసారి తేల్చి చెప్పింది. తమ బలగాలను కూడా ఉక్రెయిన్‌కు పంపబోమని పునరుద్ఘాటించింది. ఈమేరకు పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రష్యా నుంచి శరణార్థులుగా వెళ్లిన వారిని అమెరికా అధికారులు సరిహద్దుల వద్దే అడ్డుకొంటున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ పౌరులకు భద్రత కల్పిస్తూ అనుమతిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 32 లక్షల మంది శరణార్థులుగా వేరే దేశాలకు వెళ్లిపోయారని యూఎన్ తెలిపింది. రష్యా సైనిక చర్యపై స్వదేశంలోనూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఉక్రెయిన్ జాతీయ పతాకంలోని రంగుల్లో ఒకటైన పసుపురంగు దుస్తులను ధరించి రష్యన్లు ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. ఐఎస్ఎస్లోని రష్యా వ్యోమగాములు కూడా పసుపు రంగు సూట్లను ధరించడం విశేషం.