హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఇన్చార్జుల రాజ్యం కొనసాగుతున్నది. మెజారిటీ విభాగాలకు హెచ్వోడీలుగా ఇన్చార్జులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్), నర్సింగ్ రిజిస్ట్రార్, ఆయుష్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీసాక్స్) ప్రాజెక్టు డైరెక్డర్(పీడీ) పోస్టుల్లో పూర్తిస్థాయి అధికారులు లేక పాలనాపరమైన స్తబ్ధత నెలకొన్నది. కీలక విభాగాల్లో హెచ్‌వోడీల స్థానంలో ఇన్చార్జులే ఉండటంతో నిర్ణయాల్లో జాప్యం జరుగుతున్నది. ఒక్కో అధికారి తాము పనిచేస్తున్న చోటుతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఆయా శాఖలకు పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో అనేక ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్) పోస్టును కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పునరుద్ధరించినా.. ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిని నియమించలేదు. ప్రస్తుతం ఆ పోస్టుని అధికారిపై అనేక ఆరోపణలున్నా, ఆయననే కొనసాగించడంపై సొంత శాఖ ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు.
ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి(ఆయుష్)కు పూర్తిస్థాయి డైరెక్టర్ లేరు. దీంతో ఇన్చార్జి వ్యవస్థ కొనసాగుతున్నది. ఇటీవల ఇన్చార్జిగా ఉన్న శ్రీకాంత్‌బాబు స్థానంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సివిల్ సప్లయ్ బాధ్యతలను నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి ఆయేషా మస్రత్ ఖానమ్‌కు ఈ విభాగానికి డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. నర్సింగ్ కాలేజీలకు అనుమతులు, నమోదు ప్రక్రియ, నర్సుల రిజిస్ట్రేషన్, తనిఖీలు వంటి బాధ్యతలు నిర్వహించే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టు సైతం ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతున్నది.
రిజిస్ట్రార్‌గా ఉన్న విద్యావతి ఉద్యోగ విరమణ పొంది ఏడాది గడుస్తున్నా.. రెగ్యులర్ నియామకం చేపట్టలేదు. ప్రస్తుతం ఈ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ విద్యుల్లత ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ అధికారి రెండు పోస్టులను నిర్వహించడంతో పాటు కొత్త నియామకానికి సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీజీసాక్స్) ప్రాజెక్టు డైరెక్డర్(పీడీ) పోస్టు సైతం ఇన్చార్జి పాలనలోనే కొనసాగుతున్నది. ఈ పోస్టుకు గతంలో ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కమిషనర్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఇటీవల నాన్‌క్యాడర్ అధికారి కే విద్యాసాగర్‌ను ఈ శాఖకు ఇన్చార్జిగా ప్రభుత్వం నియమించింది.