హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటలపాటు రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగే వీలున్నదని అధికారులు స్పష్టంచేశారు. రాష్ట్రంలోని తూర్పు జిల్లాల్లో కొనసాగుతున్న వడగాడ్పుల తీవ్రత నేటితో ముగియనుండగా, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.
ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సహా పలు జిల్లాలకు ఉరుములతో కూడిన వర్షం కురువనున్నట్టు హెచ్చరికలు జారీచేశారు. హైదరాబాద్లో మే 6 నుంచి వర్షాల తీవ్రత పెరుగనున్నదని వెల్లడించారు. ఆదివారం దాదాపు 12 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీలు, నల్లగొండ జిల్లా అనుముల, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సిద్దిపేట జిల్లా తొగుటలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్లో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 45.8, ఖమ్మంలో 45.6, కరీంనగర్, మెదక్లో 44.6, మహబూబ్నగర్లో 44.2 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
ఆదివారం సాయంత్రం నల్లగొండ, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేశారు.