సాహిత్యం సమాజానికి దారిదీపంగా ఉండాలి అనే భావనతో పుట్టిన కవిత్వమే చిరస్థాయిగా నిలుస్తుంది. పురుషార్థ్ధ సాధనకు ప్రేరణనిచ్చే ప్రబోధాత్మకత సాహిత్య లక్షణం. రసభరితమైన వాక్యనిర్మాణం ద్వారా భావాలను లోతుగా వ్యక్తీకరించగలిగినవారే నిజమైన కవులు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు జీవితాంతం తపస్సు చేసిన వారిలో మృదుల కవిత్వం ప్రత్యేక స్థానం పొందింది.
‘ఏకం సత్ విప్రా బహుధా వదంతి’ అనే సూత్రం ప్రకారం..మనిషి బాహ్యంగా భిన్నంగా కనిపించినా అంతర్గతంగా ఒకే భావాన్ని అనుసరిస్తాడు. మృదుల తన చుట్టూ ఉన్న అలంకారాలను తొలగించి ఆత్మవివేచనతో నిజాన్ని కవిత్వంగా మలిచారు. ఆమె రుధిరం నుంచి క్షీరం దాకా కవితా సంపుటిలో ఆలోచన, ఆర్తి, ప్రయత్నం సమన్వయంగా ప్రతిఫలిస్తాయి.
ప్రతి కవిత జీవన ప్రతిబింబంలా నిలుస్తూ ఆశావాదాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కవిత్వం కాలక్షేపానికి కాదు; తాత్వికత, తార్కికత, భావుకతల సమ్మేళనంగా సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. స్త్రీల అస్తిత్వాన్ని చాటుతూ, సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ నిర్భయంగా అభివ్యక్తమవుతుంది. ‘బోగన్ విలియాలు’ వంటి కవితల్లో అనుభూతుల సుగంధం, బాధల సత్యం స్పష్టంగా కనిపిస్తాయి.
మృదుల శైలి సరళమైనదైనా భావగంభీరతతో నిండి ఉంటుంది. ఆమె కవిత్వం స్త్రీ-పురుష అసమానతలను విమర్శిస్తూ, సమానత్వాన్ని ప్రబోధిస్తుంది. సేవ, త్యాగానికి ప్రతీకలైన స్త్రీల బాధను వ్యక్తపరుస్తూ సమాజాన్ని ప్రశ్నిస్తుంది. మొత్తంగా, రుధిరం నుంచి క్షీరం దాకా కవితా సంపుటి ఆశ నుంచి నిరాశకు, ప్రతికూలత నుంచి సానుకూలతకు జరిగిన ఒక ఆత్మయానం. ఇది కేవలం కవిత్వం కాదు; జీవన సత్యాలను ప్రతిబింబించే ఒక తాత్విక దర్శనం.
-కోడోజు కృష్ణమూర్తి