నా ఆలోచనలన్నీ
ఆమె ఆకర్షణపు రేడియస్ పరిధిలో
కక్ష్యా వేగంతో ఆమె చుట్టూనే
పరిభ్రమిస్తున్నాయి..!
ఎడతెరిపి లేకుండా కురిసిన
ఆమె తొలిచూపుల తారల వర్షం
నన్ను జీరో గ్రావిటీలో ముంచేసింది..!
నా హృదయ పుస్తకంపై
ఆమె ముఖచిత్రపు ఉషోదయం
నాకు కొత్త ఫిజిక్స్‌ను పరిచయం చేసింది..!
నా గుండె దిక్సూచి ఇష్టం వచ్చినట్టు
తన దిశను మారుస్తూనే ఉంటుంది
ఆమె నడకల అలికిడి నాకు
తూర్పు దిక్కు అయింది..!
ఆమె మువ్వల అడుగుల అలజడి
నా తలపుల అక్షర కూర్పు అయ్యింది..!
ఆమె కురుల మేఘాల మధ్య మెరుపు
నా జీవితానికి ప్రేమనే మలుపు అయ్యింది..!
మూడుముళ్ల అయానిక బంధం సాక్షిగా
నా జీవన నదిలో ఆమె కలిసిపోయింది
మా ఇద్దరి ఫ్రీక్వెన్సీ ఒకేలా మారి
ఓ కొత్త అనునాదపు సంగీతాన్ని సృష్టిస్తుంది..!
ప్రతిరోజూ ఓ కొత్త సినిమా
హిట్ పాటలా మారి
న్యూటన్ గమన నియమాల తోడుగా
నవ కవిత్వమై విశ్వ వనంలో వికసిస్తుంది
ఇప్పుడు నా జీవితం
ఏక ధృవ అయస్కాంతం
ఏడు వర్ణాల సమ్మేళనం
రెండు హరివిల్లుల సంగమం