– జనావాసాల మధ్య 50 అడుగుల లోతులో తవ్వకాలు
– ప్రమాదకరంగా మారిన గుంతలు
– లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
మధిర, డిసెంబర్ 27 : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి జనావాసాల మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన మట్టి క్వారీపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొంపిమల్ల గ్రామంలోని ఇళ్ల మధ్య జరుగుతున్న మట్టి తవ్వకాలను నిరసిస్తూ శనివారం ఉదయం కాలనీవాసులు మట్టి రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుని నిలిపివేశారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. గత కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో సుమారు 50 అడుగుల లోతులో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వల్ల ఏర్పడిన అగాధాలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ గుంతల్లో పడి మనుషులు లేదా పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో ఇంత లోతుగా మట్టిని తరలించడం వల్ల భవిష్యత్లో ఇళ్ల పునాదులు దెబ్బతినే అవకాశం ఉందని వాపోతున్నారు.
ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో తెలియదు కానీ, నిబంధనల ప్రకారం జన నివాసాలకు దూరంగా ఉండాల్సిన క్వారీని ఇళ్ల మధ్య ఎలా అనుమతిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే తవ్వకాలను నిలిపివేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రొంపిమల్ల గ్రామస్తులు రెవెన్యూ, మైనింగ్ అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.