Immanuel | 2025 సంవత్సరం సెలబ్రిటీ ప్రేమకథలు, పెళ్లిళ్లతో హాట్ టాపిక్‌గా మారింది. కొత్తగా ప్రేమలో పడినవారు, తమ ప్రేమను బహిర్గతం చేసినవారు, సీక్రెట్ రిలేషన్షిప్స్ కొనసాగిస్తున్నవారు… ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రేమ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు జబర్దస్త్, బిగ్‌బాస్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్. తెలుగులో పాపులర్ రియాలిటీ షోల ద్వారా భారీ ఫ్యాన్‌బేస్ సంపాదించిన ఇమ్మాన్యుయేల్, ఇప్పటివరకు తన ప్రేమ విషయాన్ని రహస్యంగానే ఉంచాడు. అయితే తాజాగా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు షాక్ ఇచ్చాడు.
గుంటూరుకు చెందిన ఇమ్మాన్యుయేల్ పేద కుటుంబంలో పుట్టి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా తన టాలెంట్‌ను నెటిజన్లకు పరిచయం చేశాడు. ఉద్యోగ ప్రయత్నాల పేరుతో కేవలం రూ.500 చేతిలో పెట్టుకుని హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన ఇమ్మూ, పటాస్ షో ద్వారా బ్రేక్ అందుకున్నాడు. అక్కడ తన పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పటాస్ విజయం తర్వాత జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్, లేడీ కమెడియన్ వర్షతో చేసిన స్కిట్స్, కెమిస్ట్రీతో మరింత పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత జాతిరత్నాలు, కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ వంటి టాప్ షోలలో పాల్గొని ఫ్యాన్‌బేస్‌ను పెంచుకున్నాడు.
ఇమ్మాన్యుయేల్‌కు బిగ్‌బాస్ తెలుగు 9లో అవకాశం రావడం అతని కెరీర్లో కీలక మలుపు. హౌస్‌లో స్టార్ కమెడియన్‌గా అందరితో కలిసిమెలిసి ఉంటూ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. ఏకంగా 9 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం అతని ఆటకు నిదర్శనం. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన తొలి కమెడియన్‌గా నిలవాలని ఆశించిన ఇమ్మూ చివరికి 3rd రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ కోసం వారానికి రూ.2.6 లక్షల చొప్పున మొత్తం సుమారు రూ.40 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. జబర్దస్త్ రోజుల్లో వర్షతో ఇమ్మాన్యుయేల్ లవ్ ట్రాక్ కేవలం స్కిట్స్ వరకే పరిమితమని ఇప్పటికే స్పష్టం చేశాడు. అసలు తన గర్ల్‌ఫ్రెండ్ వేరే ఉందని అప్పుడే హింట్ ఇచ్చాడు. అయితే ఆమె ఎవరు అనే విషయం మాత్రం రహస్యంగా ఉంచాడు.
బిగ్‌బాస్ తెలుగు 9 ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడుపుతున్న ఇమ్మాన్యుయేల్ తాజాగా తన లవ్ స్టోరీని బయట పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.“Hello Mr. Love” అంటూ మాల్లో మాస్క్ ధరించిన తన ఫోటోతో పాటు, ఓ అమ్మాయి చేతిలో చేయి వేసుకుని ఉన్న ఫోటోను పంచుకున్నాడు. అయితే ఆమె ముఖం కానీ, పేరు కానీ వెల్లడించలేదు. ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, త్వరలోనే ఇమ్మాన్యుయేల్ తన ప్రియురాలిని అధికారికంగా పరిచయం చేస్తాడేమోనన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.