న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లడానికి వీలుగా ఉండే సౌర విద్యుత్తు టవర్లను ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి తక్కువ సూర్యరశ్మి నుంచి కూడా అత్యంత సమర్థంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని.. ఉదయం, సాయంత్రం సమయాల్లో కూడా ఈ టవర్ల నుంచి సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. మొత్తం యూనిట్‌ను ఒక ట్రక్కులో ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీటిని ఎక్కడైనా ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు.
ఈ సోలార్ టవర్‌లో రెండు వరసల్లో సౌర పలకలు ఉంటాయని, పై పలకల నీడ కింది వాటి మీద పడదని శాస్త్రవేత్తలు తెలిపారు. సంప్రదాయ సౌర పలకల కంటే ఇవి 50-60% తక్కువ స్థలాన్ని ఉపయోగించుకొని.. 25-30% ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు. ఈ సోలార్ టవర్లను ఇండ్లు, బడులు, దవాఖానలు, టెలికం టవర్లు, ఎలక్ట్రానిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లలో వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.