జాకెట్ అయినా చుడీదార్ అయినా భుజాల వెనక దారాలు పెట్టి, వీపు మీదికి కట్టి టాజిల్స్ వేలాడదీస్తేనే ఫ్యాషన్ పూర్తయినట్టు. ఆ క్రేజ్‌ను బట్టే దారాలవీ, రాళ్లవీ, కుందన్లవీ ఇలా రకరకాల టాజిల్స్ రెడీమేడ్‌గా తయారై మార్కెట్లో దొరుకుతున్నాయి. అందులో పెద్దా చిన్నా సైజులు కూడా ఇష్టాన్ని బట్టి ఎంచుకోవచ్చు. అయితే ఇందులో మరింత ముందుకు వెళ్లి వినూత్నంగా ఆలోచిస్తున్న వాళ్లూ ఉన్నారు.

కొందరు వీటిని తమ కోసమే ప్రత్యేకంగా చేయించుకుంటున్నారు కూడా. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మల టాజిల్స్ కూడా ఆ కోవలోనివే. గుడ్డతో చేసిన బొమ్మనే టాజిల్గా ఇందులో వేలాడదీసేది ఒక రకం వెరైటీ అయితే, ఆ తరహా బొమ్మల్లోనే అమ్మాయి అబ్బాయి జత వచ్చేలా చేస్తున్నవి మరో వెరైటీ. అమ్మాయి ముఖాన్ని ఎంబ్రాయిడరీ చేసి వేలాడదీసే టాజిల్స్, చిట్టి బొమ్మల టాజిల్స్… ఇలా రకరకాల డాల్ టాజిల్స్ను తమదైన శైలిలో ధరిస్తున్నారు నేటి మహిళలు. ఇలా బొమ్మలు ఇష్టముంటే మనమూ మనదైన వెరైటీ తయారు చేసుకోవడమే. ఏమంటారు?!