కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 2: భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు జిల్లా రిజర్వ్ దళం(డీఆర్జీ) పోలీసులు మరణించారు. మృతుల్లో ముగ్గురు జవాన్లు, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్-నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగింది. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ బృందాలు చోటేబేథీ పోలీస్‌స్టేషన్ ఫరిధిలోని అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో ఏరియా డామినేషన్ నిర్వహిస్తున్న మరో బృందం మందుపాతరను గుర్తించి, దానిని తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో అది ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చెంది నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలిస్తుండగా ముగ్గురు దారి మధ్యలో చనిపోయారు.