Iran vs Trump : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (Iran Ex Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatholla Ali Khamenei) అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఖమేనీ కోసం ప్రజలు కన్నీరు పెడుతుండడంపై స్పందిస్తూ.. అవి ‘దొంగ ఏడుపులు కావచ్చు’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ (Iran) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అమెరికాకు నాగరికత, చరిత్ర లేవంటూ ఘాటుగా బదులిచ్చింది.
ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీ అంత్యక్రియలకు భారీగా జనం తరలిరావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, ఇప్పుడు కనిపిస్తున్నది నకిలీ శోకం కావచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ఇరాన్ ఉన్నత నాయకత్వం మొత్తం ఒకేచోట ఉందని, వారిని ఒక్క దెబ్బతో లేపేయగలమని, కానీ తర్వాత చర్చలు జరపడానికి ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే అలా చేయడం లేదని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. ‘వ్యక్తులను చంపగలరు, కానీ వారి ఆశయాలను చంపలేరు. మీరు అయతొల్లా ఖమేనీని చంపారు. అంటే మీరు ఒక సుగంధ ద్రవ్యాల సీసాని పగులగొట్టారు. దాని సువాసన ఇప్పుడు ప్రతిచోటా వ్యాపించింది. ఆ సువాసనను మీరు పగులగొట్టలేరు’ అని పేర్కొన్నది. అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేవని విమర్శించింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. టెహ్రాన్‌లో ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరవుతూ ‘అమెరికాకు మరణం’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఇరాన్ సంతాప దినాలు ముగిశాక ఇరు దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం అవుతాయని ట్రంప్ చెప్పారు.