ద హేగ్: ముస్లింలకు చెందిన మైనార్టీ వర్గం రోహింగ్యాలపై 2017లో మయన్మార్‌లో తీవ్ర స్థాయిలో ఊచకోత జరిగింది. ఆ కేసుపై ఇవాళ అంతర్జాతీయ కోర్టు( International Court of Justice)లో వాదనలు ప్రారంభం అయ్యాయి. రోహింగ్యా మైనార్టీలను మయన్మార్ మిలిటరీ టార్గెట్ చేసి మరీ విధ్వంసం సృష్టించినట్లు గాంబియా న్యాయశాఖ మంత్రి దావద్ జాల్లో కోర్టులో ఆరోపించారు. 2019లో పశ్చిమ ఆఫ్రికాకు చెందిన గాంబియా అంతర్జాతీయ కోర్టులో తొలుత ఈ కేసును ఫైల్ చేసింది. 1948 ఊచకోత ఒప్పందాన్ని మయన్మార్ మిలిటరీ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ మయన్మార్ మిలిటరీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. గాంబియా తరపున లాయర్ పౌల్ ఎస్ రీచ్లర్ వాదించారు.
2017లో రాఖిని రాష్ట్రంలో రోహింగ్యా తిరుగుబాటు గ్రూపుపై దాడి జరిగిన తర్వాత మయన్మార్ మిలిటరీ భారీ చర్య చేపట్టింది. భద్రతా బలగాలు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. వేల మందిని చంపారు. వేలాది ఇండ్లను కాల్చేశారు. దీంతో సుమారు 8 లక్షల మంది రోహింగ్యాలు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లోకి పారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ బోర్డర్ వద్ద శరణార్థ క్యాంపుల్లో సుమారు రెండు లక్షల మంది జీవిస్తున్నారు. గత ఏడాది ట్రంప్ అకస్మాత్తుగా నిధుల్ని ఆపేయడంతో ఆ క్యాంపుల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. తిరుగబాటు దళాల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణ వల్ల రోహింగ్యా సమస్య ఉత్పన్నమైనట్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ అన్నారు.