ప్రతి ఇంట్లో ‘మిక్సీ’ తప్పకుండా ఉంటుంది. రోజువారీ వంట పనులను సులభంగా చేసి పెడుతుంది. అయితే, వాడగావాడగా.. మిక్సీ బ్లేడ్ల పదును తగ్గిపోయి.. పనితీరు మందగిస్తుంది. వాటికి మళ్లీ పదును పెట్టాలంటే.. బోలెడు ఖర్చవుతుంది. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మిక్సీ బ్లేడ్లకు తిరిగి పదును పెట్టొచ్చు.
దొడ్డు ఉప్పు స్పటికాలు గరుకుగా ఉంటాయి. మిక్సీ బ్లేడ్లకు పదును పెట్టడంలో సాయపడతాయి. మిక్సీ జార్లో అర కప్పు దొడ్డు ఉప్పు వేసి.. మీడియం స్పీడ్‌లో ఓ 30 నుంచి 40 సెకండ్ల పాటు మిక్సీ పట్టాలి. అంతే.. మిక్సీ బ్లేడ్లు పదునెక్కుతాయి.
ఐస్ క్యూబ్స్ కూడా మిక్సీ బ్లేడ్ల అంచులను పాలిష్ చేస్తాయి. మిక్సీ జార్లో సగం వరకు ఐస్ క్యూబ్స్ నింపి.. అవి మెత్తగా అయ్యేదాకా, మధ్యమధ్యలో ఆపుతూ మిక్సీ పట్టాలి. ఐస్ క్యూబ్స్ తీసేసి.. మిక్సీ జార్‌ను పూర్తిగా ఆరనివ్వాలి.
అల్యూమినియం ఫాయిల్స్తోనూ మిక్సీ బ్లేడ్స్‌ను బాగుచేసుకోవచ్చు. అల్యూమినియం ఫాయిల్స్‌ను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి.. మిక్సీ జార్లో వేయాలి. 30 సెకన్లపాటు మీడియం స్పీడ్‌లో తిప్పుతే.. బ్లేడ్స్ షార్ప్‌గా మారిపోతాయి.
కోడి గుడ్డు పెంకుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి మిక్సీ బ్లేడ్ అంచులకు పట్టిన తుప్పును, మరకల్ని ఇట్టే వదిలిస్తాయి. కోడిగుడ్డు పెంకుల్ని బాగా ఎండబెట్టి.. మిక్సీ జార్లో వేసి, పొడి అయ్యేలా మిక్సీ పట్టాలి. దాంతో, బ్లేడ్స్ తళతళా మెరిసిపోతాయి.