హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ‘జర్నలిస్టుల అక్రెడిటేషన్ సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. అసెంబ్లీలో జీవో 252 సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జారీ చేసిన జీవో 239 ప్రకారం సుమారు 23 వేల మందికి అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయని, కానీ ప్రస్తుత సర్కార్ జారీ చేసిన 252 జీవోతో దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉన్నదని వివరించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మీడియాను గౌరవించాల్సింది పోయి, అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. డెస్క్, రిపోర్టర్లను వేరుచేసి వారి మధ్య చిచ్చుపెట్టేందుకే రెండు కార్డుల విధానాన్ని తీసుకొచ్చిందని తూర్పారబట్టారు. వార్తను ప్రజలకు చేర్చడంలో డెస్క్ జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని గుర్తుచేశారు. డెస్క్ జర్నలిస్టులను కించపరిచేందుకే కేవలం గుర్తింపు కార్డుల పేరిట మభ్యపెడుతున్నదని ఆరోపించారు. జీవో 252 సవరణ కోసం అసెంబ్లీలో పట్టుబడతామని తెలిపారు.
ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్న ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఉద్ఘాటించారు. కరోనా సమయంలో ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా డెస్క్ జర్నలిస్టులతో పాటు 23 వేల మందికి అక్రెడిటేషన్లు ఇచ్చి సముచితంగా గౌరవించారని పేర్కొన్నారు. కానీ దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్ 10 వేల జర్నలిస్టులకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. 252 జీవో కారణంగా జర్నలిస్టులు హెల్త్‌కార్డులు, బస్‌పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించిందని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రీమియం కూడా చెల్లించకుండా తీరని ద్రోహం చేస్తున్నదని విరుచుకుపడ్డారు.
జర్నలిస్టులకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా ప్రశ్నిస్తానని టీయూడబ్ల్యూజే ప్రతినిధులకు హామీ ఇచ్చారు. వారి పోరాటానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. హరీశ్‌రావును కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, కోశాధికారి పీ యోగానంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్‌కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ తదితరులున్నారు.