Kajal Agarwal | ‘గతంలో పెళ్లయిన కథానాయికలకు అంతగా అవకాశాలు దక్కేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక కూడా కెరీర్లో అద్భుతంగా రాణిస్తున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం కాజల్ అగర్వాల్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత జీవితంతో రిలేట్ చేసుకునే పాత్ర ఇది. సమాజంలో జరిగే సంఘటనలపై నేను తీవ్రంగా స్పందిస్తుంటా. పదే పదే వాటి గురించి ఆలోచిస్తుంటా. నా తరపున ఏమైనా చేయాలని తపిస్తాను. సత్యభామ పాత్ర కూడా అదే పంథాలో సాగుతుంది.
ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. అందుకోసం ఫిట్నెస్ను పెంచుకోవడంతో పాటు యాక్షన్ ఘట్టాల కోసం ప్రిపేర్ అయ్యాను. ఫైట్స్ రియలిస్టిక్‌గా ఉంటాయి. గతంలో నేను ఓ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాను. అయితే ఆ పాత్ర అంత సీరియస్‌గా కనిపించదు. ‘సత్యభామ’లో మాత్రం ఎమోషన్స్, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో అందరు నన్ను చందమామ అని పిలిచే వారు. ఇకనుంచి సత్యభామ అంటారు’ అని చెప్పింది. వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నానని, కుటుంబ సభ్యుల మద్దతు వల్ల అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయని కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ‘భారతీయుడు-2’ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని, అయితే ‘భారతీయుడు-3’ చిత్రంలో తన పాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుందని కాజల్ పేర్కొంది.